Government: మరో విడత ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనం మొదలు?

  • ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో 12 బ్యాంకులు
  • వీటి సంఖ్య 4-5కు కుదించే యోచన
  • బ్యాంకుల అభిప్రాయం కోరిన కేంద్ర ప్రభుత్వం
  • విస్తృత సంప్రదింపుల తర్వాత తదుపరి అడుగులు
Government plans to start next round of public sector bank mergers

కేంద్ర ప్రభుత్వం మరో విడత ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసే ప్రణాళికతో ఉన్నట్టు తెలుస్తోంది. లోగడ పెద్ద సంఖ్యలో ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేయడం గుర్తుండే ఉంటుంది. చిన్న బ్యాంకులు అయితే, రుణాల ఎగవేతలు, ఆర్థిక అననుకూల పరిస్థితుల్లో సమస్యలను ఎదుర్కొంటున్నాయని.. నిధులు సమీకరించుకోవడానికీ ఇబ్బంది పడుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. దీంతో పెద్ద బ్యాంకులే దీర్ఘకాలంలో మనుగడ సాగించగలవన్న అభిప్రాయంతో ఉంది. ఇందులో భాగంగా మోదీ సర్కారు మొదటగా 2017లో ఎస్ బీఐలో ఐదు అనుబంధ బ్యాంకులను, భారతీయ మహిళా బ్యాంకును విలీనం చేసింది. దీంతో ఎస్ బీఐ దిగ్గజ బ్యాంకుగా అవతరించింది. 

ఆ తర్వాత రెండో విడత 2019, 2020లో ఇతర బ్యాంకుల మధ్య విలీనాన్ని పూర్తి చేసింది. దీంతో ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో ఏడు పెద్ద బ్యాంకులు, ఐదు చిన్న బ్యాంకులు పనిచేస్తున్నాయి. మరో విడత విలీనంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్యను 4-5 కు కుదించాలన్నది ప్రభుత్వ యోచనగా వుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు జరిగిన విలీనాలతో వచ్చిన ఫలితాలపై లోతైన అధ్యయన నివేదికను కేంద్ర ప్రభుత్వం పరిశీలించినట్టు వెల్లడించాయి. ఈ నెలాఖరుకు తమ అభిప్రాయం చెప్పాలని ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రభుత్వం కోరినట్టు తెలిపాయి. 

భవిష్యత్తు ప్రణాళికను రూపొందించే ముందు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ , భాగస్వాములను సంప్రదించనున్నట్టు చెప్పాయి. 2017కు ముందు ప్రభుత్వరంగంలో 27 బ్యాంకులు ఉండేవి. వాటి సంఖ్య ఇప్పుడు 12కు తగ్గింది.

More Telugu News