Varavararao: వ‌ర‌వ‌ర‌రావు బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు

  • బీమా కోరేగావ్ కేసులో అరెస్టయిన వ‌ర‌వ‌ర‌రావు
  • అనారోగ్య కార‌ణాల రీత్యా బెయిల్ ఇవ్వాల‌ని సుప్రీంకోర్టులో పిటిష‌న్‌
  • వ‌ర‌వ‌ర‌రావు త‌ర‌ఫు వాద‌న‌లు విన్న స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం
  • త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 19కి వాయిదా వేసిన వైనం
supremecourt adjourns varavararao bail petition to july 19th

బీమా కోరేగావ్ కేసులో నిందితుడిగా ఉన్న‌ పౌర హ‌క్కుల సంఘం నేత వ‌ర‌వ‌ర‌రావు బెయిల్ పిటిష‌న్‌పై మంగ‌ళ‌వారం స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది. త‌న అనారోగ్య ప‌రిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకుని మెడిక‌ల్ గ్రౌండ్స్ కింద త‌న‌కు బెయిల్ ఇవ్వాలంటూ వ‌ర‌వ‌ర‌రావు ఇటీవ‌లే బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌గా... పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఈ పిటిష‌న్‌పై మంగళవారం విచార‌ణ జ‌రిగింది. 

సోమ‌వారం జ‌రిగిన విచార‌ణ‌లో వ‌ర‌వ‌ర‌రావు త‌ర‌ఫు వాద‌న‌ల అనంత‌రం ప్ర‌భుత్వం త‌ర‌ఫు న్యాయ‌వాదిగా హాజ‌రైన సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా అవస‌రమైన ప‌త్రాల స‌మ‌ర్ప‌ణ‌కు ఒక రోజు గడువు ఇవ్వాల‌ని సుప్రీంకోర్టును కోరారు. దీంతో విచార‌ణ‌ను కోర్టు మంగ‌ళ‌వారానికి వాయిదా వేసింది. తాజాగా మంగ‌ళ‌వారం నాటి విచార‌ణ‌లో ఇరు ప‌క్షాల న్యాయ‌వాదులు మ‌రింత స‌మ‌యం కావాల‌ని కోర‌డంతో విచార‌ణ‌ను కోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది.

అదే స‌మ‌యంలో ప్ర‌స్తుతం అనారోగ్య కార‌ణాల రీత్యా ఇంటెరిమ్ బెయిల్‌పై ఉన్న వ‌ర‌వ‌రరావు... మంగ‌ళ‌వారం బెయిల్ గ‌డువు ముగియ‌డంతో ఈ రోజే ఆయ‌న లొంగిపోవాల్సి ఉంది. అయితే వ‌ర‌వ‌ర‌రావుకు ఇప్ప‌టిదాకా అందిస్తున్న అద‌న‌పు స‌దుపాయాల‌ను కొన‌సాగించాల‌ని అధికారుల‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫ‌లితంగా త‌దుప‌రి విచార‌ణ దాకా వ‌ర‌వ‌ర‌రావు ఇంటెరిమ్ బెయిల్ గ‌డువు పొడిగించిన‌ట్టయింది. త‌దుప‌రి విచార‌ణ ముగిసే దాకా వ‌ర‌వ‌ర‌రావు లొంగిపోవాల్సిన అవ‌స‌రం లేదు.

More Telugu News