Team India: ఇంగ్లండ్‌తో నేడు తొలి వన్డే.. కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసేదెవరు?

India Predicted XI for 1st ODI vs England  Who will replace injured Virat Kohli
  • ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్
  • కోహ్లీకి కనుక జట్టులో స్థానం లభించకుంటే జట్టు ఎంపిక మరింత సులభం
  • సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్‌లలో ఇద్దరికీ చోటు లభించే అవకాశం
  • పేస్ బౌలింగ్ దళాన్ని నడిపించనున్న షమీ
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-ఇంగ్లండ్ మధ్య నేడు తొలి వన్డే జరగనుంది. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న విరాట్ కోహ్లీ గాయం కారణంగా నేటి మ్యాచ్‌లో స్థానం డౌట్‌గానే ఉంది. ఈ మ్యాచ్‌లో అతడు ఆడడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో అతడి స్థానాన్ని భర్తీ చేసేదెవరన్న ఊహాగానాలు మొదలయ్యాయి. 2019 ప్రపంచకప్ తర్వాత భారత్ ఎక్కువగా వన్డే క్రికెట్ ఆడలేదు. 2023 ప్రపంచకప్ నేపథ్యంలో జట్టు కూర్పు కోసం కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో బలమైన జట్టు ఎంపికపై వారు దృష్టి సారించారు.

కేఎల్ రాహుల్ గైర్హాజరీలో పలువురు బ్యాటర్లు తమ ప్రదర్శనతో తమ ఉనికిని చాటుకుని జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తున్నారు. టాప్‌లో రోహిత్ శర్మతోపాటు శిఖర్ ధావన్ కూడా ఉంటాడు. విండీస్ పర్యటనకు ధావన్‌ను కెప్టెన్‌గా ప్రకటించడంతో వచ్చే ఏడాది ప్రపంచకప్ జట్టులో అతడు కూడా ఉంటాడు. కాగా, గాయం నుంచి కోహ్లీ కోలుకుంటే కనుక అతడిని ఈ మ్యాచ్‌లో ఆడించే అవకాశం ఉంది. ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నప్పటికీ నంబర్ 3లో అతడిని దించే అవకాశం ఉందని సమాచారం.

ఒకవేళ కోహ్లీకి తుది జట్టులో స్థానం లభించకుంటే మేనేజ్‌మెంట్‌కు జట్టు ఎంపిక సులభమవుతుంది. సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్‌లలో ఎవరినో ఒకరినే ఎంపిక చేసుకునే అవసరం తప్పుతుంది. అయ్యర్‌ను మిడిలార్డర్‌లో దించే అవకాశం ఉంది. విండీస్‌తో జరిగిన చివరి వన్డేలో క్లిష్ట పరిస్థితుల్లో అయ్యర్ 80 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. కాబట్టి అతడికి జట్టులో స్థానం ఖాయమయ్యే అవకాశం ఉంది. 

రిషభ్ పంత్ బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా ఉంటారు. మిడిలార్డర్‌లో ఇషాన్ కిషన్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన అవసరం. హార్దిక్ పాండ్యా ఆరో స్థానంలో రావొచ్చు. రవీంద్ర జడేజా ఏడో స్థానంలో దిగుతాడు. ఇక, ఎనిమిదో స్థానం కోసం శార్దూల్ ఠాకూర్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. బౌలర్‌గా ప్రసిద్ధ్ కృష్ణ వన్డేల్లో ప్రతిభ చూపుతున్నాడు. గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో 3 వన్డేల్లో ఆరు వికెట్లు, ఈ ఏడాది మొదట్లో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో మూడు మ్యాచుల్లో 9 వికెట్లు తీసుకున్నాడు. కాబట్టి తుది జట్టులో అతడికి కూడా చోటు దక్కే అవకాశం ఉంది. 

వన్డే జట్టులో భువనేశ్వర్ కుమార్‌కు చోటు లేదు కాబట్టి మహ్మద్ షమీ పేస్ బౌలింగ్ దళాన్ని నడిపిస్తాడు. అలాగే, జస్ప్రీత్ బుమ్రా కూడా అతడికి తోడుగా ఉంటాడు. ప్రీమియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ ఉండడం భారత్‌కు కలిసొచ్చే అంశం.

ఓపెనర్లుగా రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్ క్రీజులోకి వస్తారు. టాప్ ఆర్డర్‌లో సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్) బరిలోకి దిగుతారు. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా పవర్ హిట్టర్లు కాగా, పేసర్లుగా మహ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా బంతిని పంచుకునే అవకాశం ఉంది. స్పిన్నర్లుగా యుజ్వేంద్ర చాహల్, జడేజా సత్తా చాటనున్నారు.
Team India
Virat Kohli
England
Mohammed Shami
Rohit Sharma

More Telugu News