South Africa: దక్షిణాఫ్రికాలోని బార్‌లో ఘాతుకం.. తుపాకి తూటాలకు 15 మంది బలి

15 Killed In Bar Shooting Near South Africas Johannesburg
  • మినీ బస్సులో వచ్చిన సాయుధులు
  • వచ్చీ రావడంతోనే కాల్పులు 
  • మరో 9 మంది పరిస్థితి విషమం
  • కారణాలు తెలియరాలేదన్న పోలీసులు
  • పీటర్‌మారిట్స్‌బర్గ్‌లో జరిగిన ఘటనలో నలుగురి మృతి
దక్షిణాఫ్రికాలోని ఓ బార్‌లో దుండగులు జరిపిన కాల్పుల్లో 15 మంది ప్రాణాలు కోల్పోగా మరో 9 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రాజధాని జొహన్నెస్‌బర్గ్‌లోని సొవెటో టౌన్‌షిప్‌లో ఉన్న బార్‌లో జరిగిందీ ఘటన. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మినీ బస్సులో వచ్చిన కొందరు గుర్తు తెలియని సాయుధులు బార్‌లోకి ప్రవేశించి ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డారు. దీంతో బార్‌లో ఉన్న వారు భయంతో బయటకు పరుగులు తీశారు. కాల్పుల్లో 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 9 మంది పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. 

కాల్పుల అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. వారింకా పరారీలోనే ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అయితే, ఈ ఘటనకు గల కారణం ఏంటనేది ఇంకా తెలియరాలేదు. ప్రపంచంలోనే అత్యంత హింసాత్మక ఘటనలు జరిగే దక్షిణాఫ్రికాలో ప్రతి సంవత్సరం 20 వేల మంది హత్యకు గురవుతుంటారు. కాగా, ఇలాంటి ఘటనే ఒకటి సొవెటోకి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న పీటర్‌మారిట్స్‌బర్గ్‌లోనూ ఆదివారం జరిగింది. అక్కడి బార్‌లో జరిగిన కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
South Africa
Gun firing
Johannesburg
Bar

More Telugu News