Sourav Ganguly: భారత క్రికెట్‌కు దూకుడు నేర్పిన గంగూలీకి హ్యాపీ బర్త్ డే.. 50వ వసంతంలోకి ‘దాదా’

Happy Birthday Sourav Ganguly Legendary India captain turns 50
  • 1992లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన గంగూలీ
  • 15 ఏళ్ల కెరియర్‌లో ఎన్నో ఉత్థాన పతనాలు
  • కెప్టెన్‌గా భారత జట్టును మరో మెట్టు ఎక్కించిన ‘కోల్‌కతా ప్రిన్స్’
  • 2019లో బీసీసీఐ బాస్‌గా బాధ్యతలు స్వీకరించిన ‘దాదా’
టీమిండియా దిగ్గజ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నేడు 50వ పడిలోకి అడుగుపెట్టాడు. 2019లో బీసీసీఐ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన ‘దాదా’ క్రికెట్‌లో పలు సంస్కరణలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగమే ప్రతీ సిరీస్‌లోనూ ఒక్కటైనా డే/నైట్ టెస్టు. ఇక, క్రికెటర్‌గా గంగూలీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. 

భారత క్రికెట్ జట్టుకు దూకుడు నేర్పిన తొలి కెప్టెన్‌‌గా గంగూలీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. జనవరి 1992లో బ్రిస్బేన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన గంగూలీ తన 15 ఏళ్ల కెరియర్‌లో అద్భుతాలు సృష్టించాడు. 1996లో ప్రతిష్ఠాత్మక లార్డ్స్ గ్రౌండ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన తర్వాత గంగూలీ కెరియర్‌కు ఊపొచ్చింది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. 

కెప్టెన్‌గా 2001లో స్టీవ్ వా సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టును స్వదేశంలో 2-1తో ఓడించి అద్భుతమైన విజయాన్ని అందించాడు. 2003 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాను ఫైనల్‌కు తీసుకెళ్లాడు. అయితే, జొహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి కలిగించడంతో ఆస్ట్రేలియాతో జరిగిన ఆ మ్యాచ్‌లో గంగూలీ సేన ఓటమి పాలైంది. 

విజయవంతమైన భారత కెప్టెన్లలో ఒకడిగా పేరుగాంచిన గంగూలీ సారథ్యంలోని టీమిండియా ఎన్నో అద్వితీయ విజయాలు అందుకుంది. ఆ తర్వాత గంగూలీ కెరియర్‌లో డౌన్‌ఫాల్ మొదలైంది. పలు కారణాలు అతడి ఆటను దెబ్బతీశాయి. నవంబరు 2008లో నాగ్‌పూర్‌లో ఆసీస్‌తో చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. 113 టెస్టులు, 311 వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ‘కోల్‌కతా ప్రిన్స్’.. టెస్టుల్లో 7212, వన్డేల్లో 11,363 పరుగులు చేశాడు. ఇందులో 38 సెంచరీలు, 107 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 

అంతేకాదు, బంతితోనూ ‘దాదా’ అద్భుతాలు చేశాడు. మొత్తం 132 వికెట్లు తీసుకున్నాడు. రెండుసార్లు ఐదు వికెట్ల ఘనత సాధించగా, ఒకసారి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత ఐపీఎల్‌లోనూ గంగూలీ ఆడాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తోపాటు అప్పటి పూణె వారియర్స్‌కు కూడా ప్రాతినిధ్యం వహించాడు. భారత క్రికెట్‌ను మరోస్థాయికి తీసుకెళ్లిన గంగూలీకి అభిమానులు, తాజా, మాజీ క్రికెటర్ల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
Sourav Ganguly
Team India
BCCI
Birthday

More Telugu News