Dr BR Ambedkar Konaseema District: చల్లపల్లి పంచాయతీ కార్యదర్శి భవాని ఆత్మహత్య.. అధికార పార్టీ నేతల వేధింపులే కారణమంటున్న బంధువులు

Challapalli Panchayat Secretary Bhavani Committed Suicide
  • 90 రోజులు దాటినా నిర్వహించని పంచాయతీ పాలకవర్గ సమావేశం
  • ఆలస్యం కావడంతో వేధింపులకు గురిచేశారంటున్న కుటుంబ సభ్యులు
  • జిల్లా పంచాయతీ అధికారికి, కలెక్టర్‌కు కొందరు ఫిర్యాదు
  • ఫిర్యాదు ఉపసంహరణకు రూ. లక్ష డిమాండ్ చేశారన్న బాధిత కుటుంబ సభ్యులు
కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి పంచాయతీ కార్యదర్శి రొడ్డా భవాని (32) నిన్న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 2019లో చల్లపల్లి పంచాయతీకి కార్యదర్శిగా వచ్చిన ఆమె మూడు నెలల క్రితం పంచాయతీ పాలకవర్గం సమావేశం నిర్వహించాల్సి ఉంది. అయితే, 90 రోజులు దాటినా సమావేశం నిర్వహించలేదు. 

ఇక అప్పటి నుంచే ఆమెకు వేధింపులు మొదలైనట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అవి రోజురోజుకు మరింత పెరగడంతో భరించలేకే భవాని ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం భవాని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా, కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. 

న్యాయం చేస్తామని హామీ ఇస్తేనే పోస్టుమార్టానికి అంగీకరిస్తామని తేల్చి చెప్పారు. పోలీసులు వారికి నచ్చజెప్పడంతో చివరికి అంగీకరించారు. భవానీకి భర్త వెంకటేశ్వరరావు, కుమార్తె, కుమారుడు ఉన్నారు. వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

కాగా, పంచాయతీ పాలకవర్గ సమావేశం నిర్వహించనందుకు భవానిపై జిల్లా పంచాయతీ అధికారికి, కలెక్టర్‌కు కొందరు ఫిర్యాదు చేశారని, దానిని వెనక్కి తీసుకునేందుకు రూ. లక్ష రూపాయలు డిమాండ్ చేశారని బాధిత కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. రూ. లక్ష ఇచ్చిన తర్వాత కూడా మరికొంత డిమాండ్ చేయడంతోపాటు వేధింపులకు గురిచేయడంతో తట్టుకోలేకే భవాని ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Dr BR Ambedkar Konaseema District
Uppalaguptam
Andhra Pradesh
Panchayat Secretary

More Telugu News