Vastu Expert: సూచనల కోసం వచ్చి.. వాస్తు నిపుణుడు చంద్రశేఖర గురూజీని హత్య చేసిన దుండగులు

Vastu Expert Chandrashekhar Guruji Killed In Karnataka Hotel
  • హోటల్ లాబీలో అందరూ చూస్తుండగానే హత్య
  • అడ్డుకునే ప్రయత్నం చేసిన హోటల్ సిబ్బంది
  • ఆయుధాలు చూసి భయపడి వెనక్కి తగ్గిన వైనం
  • గురూజీ శరీరంపై 39 కత్తిపోట్లు
  • హత్య అనంతరం ఆయుధాలు చేపట్టుకుని పరారీ
ప్రముఖ సరళ వాస్తు నిపుణుడు చంద్రశేఖర్ అంగడి అలియాస్ చంద్రశేఖర్ గురూజీ నిన్న దారుణ హత్యకు గురయ్యారు. కర్ణాటకలోని హుబ్బళ్లిలో పట్టపగలు ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉంకల్ లేక్ సమీపంలోని ఓ హోటల్‌లో విడిది చేసిన ఆయన వద్దకు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇద్దరు ఆగంతుకులు వచ్చారు. వాస్తు సూచనల కోసమంటూ వచ్చిన వారు రిసెప్షన్ వద్దనున్న సీట్లలో కూర్చున్నారు. ఈలోగా గురూజీ రావడంతో వారిలో ఒకరు ఒంగి ఆయన కాళ్లకు నమస్కరించాడు. మరొకడు వెంటనే పదునైన ఆయుధాన్ని తీసుకుని ఆయనపై దాడికి తెగబడ్డాడు.

ఆ తర్వాత ఇద్దరూ కలిసి విచక్షణ రహితంగా కత్తులతో ఆయన శరీరాన్ని తూట్లు పొడిచారు. వెంటనే అప్రమత్తమైన హోటల్ సిబ్బంది వారిని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే, వారి చేతుల్లో ఆయుధాలు ఉండడంతో దగ్గరికి వెళ్లేందుకు భయపడ్డారు. రక్తపు మడుగులో కుప్పకూలిన గురూజీ మరణించినట్టు నిర్ధారించుకున్న దుండగులు చేతుల్లో కత్తులతోనే అక్కడి నుంచి పరారయ్యారు.

ఆయన శరీరంపై 39 కత్తిపోట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. హోటల్ రిసెప్షన్‌లో ఉన్న సీసీకెమెరా ద్వారా నిందితులను గుర్తించే పనిలో ఉన్నట్టు చెప్పారు. ఆయన హత్యకు కారణమేంటన్నది తెలియరాలేదు. కాగా, బాగల్‌కోట్‌లో ఉండే చంద్రశేఖర్ గురూజీ వ్యక్తిగత పనుల నిమిత్తం హుబ్లీ వచ్చినట్టు తెలుస్తోంది.

వాస్తు నిపుణుడిగా దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న చంద్రశేఖర్ గురూజీ ఎన్నో టీవీ చానళ్లలో వాస్తుకు సంబంధించి సలహాలు, సూచనలు ఇస్తుంటారు. సివిల్ ఇంజినీరింగ్‌తోపాటు కాస్మిక్ ఆర్కిటెక్చర్‌లో డాక్టరేట్ పొందిన ఆయన 2 వేలకు పైగా సెమినార్లలో పాల్గొన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 16కు పైగా అవార్డులు అందుకున్నారు. కాగా, హోటల్ రిసెప్షన్ వద్దనున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయిన చంద్రశేఖర్ గురూజీ హత్య వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Vastu Expert
Chandrashekhar Guruji
Karnataka
Hubballi

More Telugu News