Maharashtra: త్వరలోనే కేబినెట్​ విస్తరణ.. ఎవరెవరికి మంత్రి పదవులో మాట్లాడుకుని తేలుస్తాం: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్​

Cabinet expansion soon We will talk about who will get the minister post says Fadnavis
  • నాగ్ పూర్ లో మీడియాతో మాట్లాడిన బీజేపీ నేత
  • ప్రభుత్వ ఏర్పాటు తర్వాత తొలిసారిగా తన నియోజకవర్గానికి పయనం
  • భారీ ర్యాలీగా స్వాగతం పలికిన మద్దతుదారులు, పార్టీ శ్రేణులు
  • ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వంలో ఏక్ నాథ్, ఫడ్నవీస్ ఇద్దరే..
మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన తిరుగుబాటు వర్గం, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ త్వరలోనే ఉంటుందని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు అనంతరం ఆయన మంగళవారం తొలిసారిగా తన నియోజకవర్గం నాగ్ పూర్ కు వెళ్లారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఫడ్నవీస్ తెలిపారు. ఎవరెవరికి ఏయే పదవులు అన్నది చర్చించి నిర్ణయిస్తామని చెప్పారు. నాగ్ పూర్ కు చేరుకున్న ఫడ్నవీస్ కు ఆయన మద్దతుదారులు, బీజేపీ నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీతో... ఘనంగా స్వాగతం పలికారు. 

ఇప్పటికి ఇద్దరే.. సీఎం, డిప్యూటీ సీఎం
మహారాష్ట్రలో ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఏర్పాటైనా ముఖ్యమంత్రిగా ఏక్ నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ఇద్దరే ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం వారిద్దరే ప్రభుత్వ హోదాలో ఉన్నారు. బీజేపీ తరఫున, షిండే వర్గం తరఫున ఎవరెవరికి మంత్రి పదవులు ఇస్తారనేది తేలాల్సి ఉంది. అంతేకాదు తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో ఎందరిని మంత్రి పదవి వరిస్తుంది? బీజేపీ ఎన్ని పదవులు తీసుకుంటుంది అన్నదీ ఆసక్తిగా మారింది.

కాస్త ఊపిరితీసుకున్నాక..
మంత్రివర్గ విస్తరణపై సోమవారం ఏక్ నాథ్ షిండే కూడా స్పందించారు. ‘‘కొన్ని రోజులుగా చాలా ఒత్తిడి మధ్య ఉన్నాం. కొంత ఊపిరి తీసుకోనివ్వండి. నేను, ఫడ్నవీస్ కూర్చుని.. మంత్రి పదవులు ఎవరెవరికి ఇవ్వాలనేది మాట్లాడుకుంటాం” అని పేర్కొన్నారు.

Maharashtra
Deputy CM
Shiv Sena
BJP
Devendra Fadnavis
Political

More Telugu News