Pawan Kalyan: ​పాలకులు గతి తప్పితే అల్లూరి స్ఫూర్తితో వీరులు పుడుతూనే ఉంటారు: పవన్ కల్యాణ్

Pawan Kalyan pays tributes to Alluri Seetharama Raju
  • నేడు అల్లూరి 125వ జయంతి
  • తెలుగుగడ్డపై పలుచోట్ల వేడుకలు
  • విప్లవజ్యోతికి నీరాజనాలు అంటూ పవన్ స్పందన
  • అణచివేతలో ఉద్భవించిన విప్లవాగ్ని అంటూ వ్యాఖ్య  

విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా తెలుగు గడ్డ పులకించిపోతోంది. ఆ మహనీయుడి జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో స్పందించారు. అణచివేతలో ఉద్భవించిన విప్లవాగ్ని అల్లూరి సీతారామరాజు అని కీర్తించారు. ప్రజల సంపద, మాన ప్రాణాలకు పాలకులే భక్షకులైన నాడు, వారు అవినీతి, ఆశ్రిత పక్షపాతానికి లోనైన నాడు ప్రభుత్వాలను కూకటివేళ్లతో పెకలించే వీరులు ఉదయిస్తారని చెప్పేందుకు అల్లూరి సీతారామరాజే నిలువెత్తు తార్కాణం అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 

ప్రకృతి ఒడిలో జీవనయానం సాగించే గిరిపుత్రులకు బతుకుపోరాటం నేర్పి, ఆ పోరాటంలోనే అమరుడైన విప్లవజ్యోతి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఆ మహావీరుడికి నమస్సుమాంజలి అర్పిస్తున్నానని తెలిపారు. గిరిపుత్రుల హక్కుల కోసం అతి పిన్నవయసులోనే విప్లవబాట పట్టి 27 ఏళ్లకే అమర వీరత్వం పొందిన సీతారామరాజు దేశ స్వాతంత్య్రోద్యమానికి దివిటీగా మారడం తెలుగుజాతికి గర్వకారణం అని అభివర్ణించారు. 

ఎక్కడ పాలకులు గతి తప్పుతారో, ఎక్కడ పాలకులు దోపిడీదారులుగా మారతారో అక్కడ సీతారామరాజు స్ఫూర్తితో వీరులు పుడుతూనే ఉంటారని చరిత్ర చెబుతోందని వెల్లడించారు. "అటువంటి వీరుడు జన్మించిన పుణ్యభూమిపై జన్మించడం నా సౌభాగ్యంగా భావిస్తున్నాను" అంటూ పవన్ కల్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. 

ఏ లక్ష్యం కోసం అల్లూరి సీతారామరాజు అమరుడయ్యాడో ఆ లక్ష్యంతో జనసేన ముందుకు సాగుతుందని ఈ పర్వదినాన మరోసారి ఉద్ఘాటిస్తున్నానని వెల్లడించారు. ఆ విప్లవ జ్యోతికి తన పక్షాన, జనసైనికుల పక్షాన నివాళులు అర్పిస్తున్నానంటూ తన ప్రకటనలో తెలిపారు.

  • Loading...

More Telugu News