Shiv Sena: 'అవును.. మాది ఈడీ గవర్నమెంటే..' అంటూ 'ఈడీ'కి అర్థం చెప్పిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్

Yes ours is ED government Maharashtra Deputy CM Fadnavis said what is ED
  • ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులను నిరసిస్తూ అసెంబ్లీలో ‘ఈడీ.. ఈడీ’ అంటూ నినాదాలు చేసిన ప్రతిపక్షాలు
  • ఈడీ అంటే.. ఏక్ నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ అన్న ఫడ్నవీస్ 
  • మరోసారి శివసేన, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని వ్యాఖ్య 
  • పార్టీ ఆదేశాల ప్రకారమే తాను ఉప ముఖ్యమంత్రిని అయ్యానన్న ఫడ్నవీస్ 
మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ నేతలపై ఎన్ ఫోర్స్ మెంట్ (ఈడీ) దాడులను నిరసిస్తూ.. అసెంబ్లీలో విపక్ష సభ్యులు ‘ఈడీ.. ఈడీ..’ అంటూ నినాదాలు చేయడంపై.. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దీటుగా స్పందించారు. “ప్రతిపక్షాలు మాది ఈడీ ప్రభుత్వం అని నినాదాలు చేస్తున్నాయి. అవును.. మాది ఈడీ గవర్నమెంటే. ఈడీ అంటే ఏక్ నాథ్, దేవేంద్ర ఫడ్నవీస్..” అని ఆయన పేర్కొన్నారు.

విశ్వాస పరీక్షలో గెలిచాక..
ఆదివారం జరిగిన స్పీకర్ ఎన్నికలో బీజేపీ–ఏక్ నాథ్ షిండే వర్గానికి వచ్చిన మద్దతుకంటే.. సోమవారం జరిగిన బల పరీక్షలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు. దీనితో ఏకంగా 164 మంది సభ్యుల మద్దతుతో ఏక్ నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ సర్కారు విశ్వాస పరీక్షలో నెగ్గింది. ఈ సందర్భంగానే అసెంబ్లీలో కాంగ్రెస్, ఎన్సీపీ, ఉద్ధవ్ థాకరే వర్గం ఎమ్మెల్యేలు ‘ఈడీ.. ఈడీ..’ అంటూ నినాదాలు చేశారు. దీనికి దీటుగానే ఫడ్నవీస్ తమది ఈడీ గవర్నమెంటే అని జవాబిచ్చారు.

పార్టీ చెప్పినందుకే ఉప ముఖ్యమంత్రి
ఏక్ నాథ్ షిండేతో కలిసి తాము మరోసారి శివసేన–బీజేపీ సర్కారును ఏర్పాటు చేశామని దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. పార్టీ ఆదేశాల మేరకే తాను ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నానని చెప్పారు. పార్టీ తనను ఇంట్లో కూర్చొమ్మంటే కూర్చునే వాడినని అన్నారు. ఈ ప్రభుత్వంలో అధికారం కోసం గొడవలు ఏమీ ఉండబోవని, తాము పూర్తిగా సహకరిస్తామని ఫడ్నవీస్ తెలిపారు.

Shiv Sena
Devendra Fadnavis
Eknath Shinde
Maharashtra
Political

More Telugu News