CPI Ramakrishna: ఏపీకి మోదీ ప్రత్యేకహోదా ప్రకటించాలి: సీపీఐ రామకృష్ణ

CPI Ramakrishna demands Modi to announce special status to AP
  • భీమవరంలో జరిగే అల్లూరి 125వ జయంతి వేడుకల్లో పాల్గొననున్న మోదీ
  • విభజన చట్టం హామీలను అమలు చేయాలని కోరిన రామకృష్ణ
  • పోలవరంకు తక్షణమే నిధులు మంజూరు చేయాలని డిమాండ్
ప్రధాని మోదీ ఏపీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు భీమవరంలో ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి మోదీ హాజరవుతున్నారు. అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు. అనంతరం భీమవరంకు సమీపంలోని పెద అమిరంలో జరిగే భారీ బహిరంగసభలో ఆయన పాల్గొననున్నారు. 

ఈ నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ... భీమవరంలో జరిగే సభలో మోదీ ఏపీకి ప్రత్యేక హోదాను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. ఏపీలో వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి తగు నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుకు తక్షణమే నిధులను మంజూరు చేసి, ఆ ప్రాజెక్టు త్వరగా పూర్తయ్యేందుకు సహకరించాలని కోరారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని, కేంద్రీయ విద్యాసంస్థకు నిధులు మంజూరు చేయాలని అన్నారు.

మరోవైపు మోదీ సభకు గవర్నర్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సోము వీర్రాజు, పురందేశ్వరి, మెగాస్టార్ చిరంజీవి తదితరులు హాజరుకానున్నారు.
CPI Ramakrishna
Narendra Modi
BJP

More Telugu News