Narendra Modi: తెలంగాణ ప్రజల ఆశీస్సుల కోసమే వచ్చా: ప్రధాని మోదీ

Modi says he came to Hyderabad for blessings of Telangana people
  • సికింద్రాబాద్ లో బీజేపీ విజయ సంకల్ప సభ
  • హాజరైన ప్రధాని మోదీ
  • రాజకీయ విమర్శల జోలికి వెళ్లని మోదీ
  • తెలంగాణ అభివృద్ధిపైనే వ్యాఖ్యలు
సికింద్రాబాద్ లో బీజేపీ ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. తెలంగాణ ప్రజల ఆశీస్సుల కోసమే తాను ఇక్కడికి వచ్చినట్టు వెల్లడించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం తథ్యమని, అప్పుడే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. ఆవిష్కరణల పరంగా తెలంగాణ దేశానికే కేంద్రంగా మారిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం ఎంతో కృషి చేస్తోందని మోదీ వెల్లడించారు. 

రాష్ట్రంలో రూ.35 వేల కోట్ల నిధులతో ఐదు భారీ ప్రాజెక్టులు చేపట్టామని, తమ హయాంలో తెలంగాణలో జాతీయ రహదారులు రెండు రెట్లు పెరిగాయని వివరించారు. హైదరాబాదులో అనేక ఫ్లైఓవర్లు నిర్మించామని, నగరం చుట్టూ ప్రాంతీయ రింగ్ రోడ్డు కూడా నిర్మిస్తున్నామని తెలిపారు. 

తమ పాలనలో గ్రామీణ యువతను ప్రోత్సహిస్తున్నామని, తెలంగాణ రైతాంగానికి లబ్ది చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. పంటల కనీస మద్దతు ధర పెంచామని స్పష్టం చేశారు. తెలంగాణలో మెగా టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, తన ప్రసంగంలో ప్రధాని మోదీ ఎక్కడా రాజకీయ విమర్శల జోలికి వెళ్లలేదు. తెలంగాణ అభివృద్ధిపైనే స్పందించారు.
Narendra Modi
Vijay Sankalp Sabha
BJP
Secunderabad
Telangana

More Telugu News