Nagababu: జీపీఎఫ్ మళ్లింపు సాంకేతిక లోపమైతే పంచాయతీ నిధులు దారి మళ్లించడాన్ని ఏమంటారు?: నాగబాబు

  • ప్రభుత్వంపై నాగబాబు విమర్శలు
  • కష్టార్జితాన్ని కూడా దోచుకుంటున్నారని వ్యాఖ్యలు
  • ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్
Nagababu slams YCP Govt

ప్రజల కష్టార్జితాన్ని, ప్రభుత్వ ఖజానాను దోచుకుంటున్న వైసీపీని సాగనంపాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి సొమ్ములను తీసుకోవడాన్ని సాంకేతిక లోపం అంటున్న వైసీపీ సర్కారు... రాష్ట్రవ్యాప్తంగా 12,918 గ్రామ పంచాయతీల ఖాతాల్లోని నిధులను ఊడ్చేయడాన్ని ఏమంటారు? అని ప్రశ్నించారు. గ్రామాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం జమచేసిన 15వ ప్రణాళిక సంఘం నిధులను మళ్లించుకోవడంపై ప్రజలకు సమాధానం చెప్పాలని స్పష్టం చేశారు. 

నెలవారీ ఆదాయంలో కొంత సొమ్మును భవిష్యత్ అవసరాలు, పిల్లల చదువులు, గృహనిర్మాణం, వైద్య ఖర్చులు, తదితర అవసరాల నిమిత్తం జీపీఎఫ్ నిధిగా పొదుపుచేసుకుంటున్న ఉద్యోగుల కష్టార్జితం రూ.800 కోట్లు మళ్లించేసుకున్న వైసీపీని సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. రాజకీయాలకు అతీతంగా పౌరసమాజం బాధిత ఉద్యోగుల పక్షాన నిలబడాలని నాగబాబు పిలుపునిచ్చారు. సగటు ప్రభుత్వ ఉద్యోగిపై ఆధారపడి ఉండే కుటుంబ సభ్యుల అవసరాలు ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా తనకు తెలుసని వివరించారు. 

ఏపీ ప్రజలపై లక్షల కోట్ల రుణభారాన్ని మోపిన సర్కారు, సర్పంచుల ఖాతాలో చిల్లిగవ్వ లేకుండా తీసుకుందని ఆరోపించారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల కష్టార్జితం కూడా దోచుకునేందుకు తెగించడం ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యానికి పరాకాష్ఠ అని విమర్శించారు. 

కాగా, శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చే భక్తుల నుంచి వసతి గృహాల అద్దె కోసం వసూలు చేసే రిఫండబుల్ డిపాజిట్ లో అద్దె పోను మిగిలిన సొమ్మును తిరిగి చెల్లించడంలేదని నాగబాబు ఆరోపించారు. దీనిపై ప్రశ్నిస్తే, మీ బ్యాంకు ఖాతాలకు పంపుతామని భక్తులకు చెబుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని వెల్లడించారు. దీనిపై టీటీడీ అధికారులు బదులివ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

More Telugu News