Ayyanna Patrudu: న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి బతగ్గలుగుతున్నాం.. లేదంటే చంపేద్దురు: అయ్యన్నపాత్రుడు

  • శని, ఆదివారాల్లో పోలీసులు తన ఇంటి చుట్టూ తిరుగుతున్నారన్న అయ్యన్న
  • రఘురామరాజును కొట్టించినట్టు తనను కూడా కొట్టించాలని చూస్తున్నారని ఆరోపణ
  • భయపెట్టి గొంతు నొక్కేందుకే కేసులు పెడుతున్నారని ఆగ్రహం
TDP leader ayyanna patrudu slams ysrcp

న్యాయస్థానాలు అనేవి ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో బతగ్గలుగుతున్నామని, లేదంటే తమలాంటి వారిని కొట్టి చంపేసి ఉండేవారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. పార్టీ అధినేత చంద్రబాబును కలిసేందుకు నిన్న టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తమను భయపెట్టి లొంగదీసుకోవాలని వైసీపీ నేతలు భావిస్తున్నారన్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజును సీఐడీ కస్టడీలో కొట్టించినట్టు తనను కూడా కొట్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. 

అందుకోసమే శని, ఆదివారాల్లో పోలీసులు తన ఇంటి చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. ఆ రెండు రోజుల్లో కోర్టుకు సెలవు కాబట్టి ఏం చేయలేరని భావిస్తున్నారని అన్నారు. వైసీపీ వాళ్లకు వాళ్ల భాషలో మాట్లాడితేనే అర్థమవుతుందన్న ఉద్దేశంతోనే అలా మాట్లాడాల్సి వస్తోందన్నారు.

ఆంధ్రా యూనివర్సిటీ పరువు తీశానని కొత్తగా తనపై మరో కేసు పెట్టారని, భయపెట్టి గొంతు నొక్కేందుకే ఇలాంటి కేసులు పెడుతున్నారని అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అరెస్ట్ చేయాలంటే కేసు నమోదు చేయాలని, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని, దానిని ఆన్‌లైన్‌లోనూ పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నిబంధనలు పాటించకుండా ఇంటి కొస్తే కాపాడేందుకు కోర్టులు ఉన్నాయని, భగవంతుడు కూడా ఉన్నాడని అయ్యన్న చెప్పుకొచ్చారు.

More Telugu News