Eknath Shinde: ముంబయిలో కాలుమోపిన ఏక్ నాథ్ షిండే... కాసేపట్లో ఫడ్నవీస్ తో భేటీ

Eknath Shinde arrives Mumbai and set to meet Fadnavis
  • మహారాష్ట్రలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు
  • సీఎం పదవి నుంచి తప్పుకున్న ఉద్ధవ్ థాకరే
  • కొత్త సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్!
  • గవర్నర్ తో భేటీ కానున్న ఫడ్నవీస్, షిండే
మహారాష్ట్ర రాజకీయాల్లో పరిణామాలు చకచకా మారుతున్నాయి. అధికార శివసేన పార్టీకి ఎసరుపెట్టిన రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే... రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. గత కొన్నిరోజులుగా అసోంలోని గువాహటిలో క్యాంపు రాజకీయాలు చేసి, ఆపై గోవా చేరుకున్న ఏక్ నాథ్ షిండే... ఈ మధ్యాహ్నం ముంబయిలో అడుగుపెట్టారు. కాసేపట్లో ఆయన బీజేపీ నేత, కాబోయే సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నివాసం 'సాగర్' కు తరలి వెళ్లనున్నారు. ఫడ్నవీస్ తో సమావేశమై పదవుల పంపకాలపై చర్చించనున్నారు. 

ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రిగా ఏక్ నాథ్ షిండే వ్యవహరించేట్టుగా ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ సమావేశం కానున్న అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. భేటీ అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు వారిద్దరూ గవర్నర్ బీఎస్ కోష్యారీని కలిసి నూతన ప్రభుత్వ ఏర్పాటుపై వివరించనున్నారు. 

ప్రస్తుతం ఫడ్నవీస్ నివాసంలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరుగుతోంది. ఉద్ధవ్ థాకరే రాజీనామా, తదితర పరిణామాలపై కమిటీ సభ్యులు చర్చిస్తున్నారు. ఈ సాయంత్రం బీజేపీ కోర్ కమిటీ... శివసేన రెబెల్ వర్గంతో మాట్లాడే అవకాశం ఉంది.
Eknath Shinde
Mumbai
Devendra Fadnavis
BJP
Shiv Sena
Maharashtra

More Telugu News