AB Venkateswara Rao: సీఎం జగన్, శ్రీలక్ష్మిలపై ఛార్జ్ షీట్లు ఉన్నాయి.. నాపై లేవు: ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు

There are charge sheets on CM Jagan but not on me says AB Venkateswara Rao
  • నా సంతకాలను ఫోర్జరీ చేశారని ఫిర్యాదు చేస్తే.. ఇంత వరకు సీఎస్ స్పందించలేదన్న ఏబీ 
  • సీఎంకు, శ్రీలక్ష్మికి వర్తించనివి నాకెలా వర్తిస్తాయని ప్రశ్న 
  • నాపై పెట్టిన ఎఫ్ఐఆర్ కోర్టులో నిలబడదని వ్యాఖ్య 
తనను మరోసారి సస్పెండ్ చేయడంపై ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మండిపడ్డారు. తనపై ఒక్క ఛార్జ్ షీట్ కూడా లేదని ఆయన అన్నారు. తన సంతకాలను ఫోర్జరీ చేశారని... దీనిపై సీఎస్ కు మూడు సార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మీద 12 సీబీఐ కేసులు, 6 ఈడీ కేసుల్లో ఛార్జ్ షీట్లు ఉన్నాయని... ఐఏఎస్ శ్రీలక్ష్మిపై కేసులు, ఛార్జ్ షీట్లు ఉన్నాయని... వీరికి వర్తించనివి తనకెలా వర్తిస్తాయని ప్రశ్నించారు. తనను ఎలాగైనా ఇరికించాలనే ఉద్దేశంతో... ఒకటిన్నర సంవత్సరం నుంచి కొండను తవ్వుతూనే ఉన్నారని... ఇంత వరకు ఒక్క ఎలుకను కూడా పట్టలేదని అన్నారు. 

మాట్లాడితే ఇజ్రాయెల్ కంపెనీ అంటుంటారని... అదేమైనా సూట్ కేస్ కంపెనీనా లేక కోల్ కత్తా కంపెనీనా అని ఏబీవీ ప్రశ్నించారు. కొందరు అధికారుల తీరు వల్ల ప్రభుత్వానికి, వ్యవస్థకు చెడ్డపేరు వస్తుందని అన్నారు. సీఎంకు కానీ, సీఎస్ కు కానీ, డీజీపీకి కానీ కొన్ని పరిమితులు ఉంటాయని.. పరిమితులు దాటి ఎవరూ వ్యవహరించకూడదని అన్నారు. తనపై ఏసీబీ పెట్టిన ఎఫ్ఐఆర్ కోర్టులో నిలవదని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇటీవలే తనకు పోస్టింగ్ ఇచ్చారని... ఇంతలోనే తాను ఏం చేశానని సస్పెండ్ చేశారని ఆయన ప్రశ్నించారు. 
AB Venkateswara Rao
IPS
Jagan
YSRCP
Sri Lakshmi

More Telugu News