BJP: హైదరాబాదులో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఏర్పాట్లు ముమ్మరం

Hyderabad hosts BJP National Executive Members meetings
  • జులై 2,3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
  • జేపీ నడ్డా అధ్యక్షతన సమావేశాలు
  • నడ్డాకు భారీ ర్యాలీతో స్వాగతం పలకనున్న తెలంగాణ నేతలు
  • జులై 3న హైదరాబాదులో మోదీ సభ
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ ఆతిథ్యమిస్తోంది. ఈ సమావేశాలు జులై 2, 3 తేదీల్లో నగరంలో జరగనున్నాయి. బీజేపీ జాతీయస్థాయి అగ్రనేతలందరూ హాజరయ్యే ఈ సమావేశాలకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. తుది సన్నాహాలపై సమీక్షించేందుకు బీజేపీ జాతీయ కార్యదర్శి, తెలంగాణ ఇన్చార్జి తరుణ్ చుగ్, ఇతర నేతలు నేడు హైదరాబాద్ రానున్నారు.

కాగా, ఈ సమావేశాలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సారథ్యం వహించనున్నారు. నడ్డా జులై 1నే హైదరాబాద్ చేరుకోనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి సమావేశాలకు వేదికగా నిలుస్తున్న నోవాటెల్ వరకు భారీ ర్యాలీతో నడ్డాకు స్వాగతం పలకాలని తెలంగాణ బీజేపీ నేతలు నిర్ణయించారు. అదే రోజున సాయంత్రం నడ్డా అధ్యక్షతన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశం జరుగుతుంది. జాతీయ కార్యవర్గ సమావేశాల అజెండా, చేయాల్సిన తీర్మానాలపై ఈ భేటీలో చర్చిస్తారు. 

ఇక, జులై 2 ఉదయం బీజేపీ పదాధికారుల సమావేశం ఉంటుంది. సాయంత్రం 4 గంటల నుంచి జులై 3వ తేదీ సాయంత్రం 5 గంటలకు జాతీయ కార్యవర్గ సమావేశాలు కొనసాగుతాయి. జులై 3వ తేదీ సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ ఉంటుంది.
BJP
National Meetings
Hyderabad
JP Nadda
Narendra Modi
Telangana

More Telugu News