amith shah: పరమ శివుడు గరళం మింగినట్టుగా మోదీజీ ఆ బాధను దిగమింగారు..: అమిత్ షా

He fought for 19 years braved pain Shah defends Modi after Guj riots verdict
  • సన్నిహితంగా ఉన్నప్పుడు తాను చూశానన్న కేంద్ర హోంమంత్రి
  • గుజరాత్ అల్లర్ల చిచ్చు రాజకీయ ప్రేరేపితమని వ్యాఖ్య
  • రాజకీయ ప్రత్యర్థులు, జర్నలిస్టులు చేసిన పనిగా అభివర్ణన
2002 నాటి గుజరాత్ మత ఘర్షణల్లో నాడు సీఎంగా పనిచేసిన ప్రధాని మోదీకి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు నిన్న సమర్థించిన సంగతి తెలిసిందే. దీని వెనుక పెద్ద కుట్ర ఉందని పిటిషనర్ పేర్కొంటూ, తాజా దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఓ వార్తా సంస్థతో తన అభిప్రాయాలను పంచుకున్నారు.

‘‘ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వచ్చిన అన్ని ఆరోపణలు రాజకీయ ప్రేరేపితం. ఓ పెద్ద నేత (మోదీ) 18-19 ఏళ్ల పాటు ఒక్క మాట కూడా మాట్లాడకుండా పోరాడారు. పరమ శివుడు గరళాన్ని మింగినట్టుగా ఇంతకాలం పాటు బాధను అంతా తనే భరించారు. ఆయన బాధపడడాన్ని నేను సన్నిహితంగా ఉన్న సందర్భాల్లో గమనించాను. విషయం కోర్టు పరిధిలో ఉన్నందున దృఢ సంకల్పం ఉన్న వ్యక్తి మాత్రమే మాట్లాడకుండా నిలబడగలడు. 

బీజేపీ ప్రత్యర్థులు, సిద్ధాంతాల పరంగా రాజకీయ ప్రేరణకు గురైన జర్నలిస్టులు, కొన్ని ఎన్జీవోలు ఈ ఆరోపణలకు ప్రచారం కల్పించారు. దీంతో ఈ అబద్ధాలే నిజమని అందరూ నమ్మే పరిస్థితి కల్పించారు’’ అని అమిత్ షా పేర్కొన్నారు. గుజరాత్ రాష్ట్రానికే చెందిన అమిత్ షా మోదీకి అత్యంత సన్నిహితులు, విశ్వాస పాత్రులు అన్న సంగతి తెలిసిందే. 

రాహుల్ గాంధీని నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారిస్తుంటే.. ఆయన మద్దతుదారులు దేశవ్యాప్తంగా నానా యాగీ చేస్తుండగా.. ప్రధాని మోదీ సిట్ విచారణకు హాజరైనా, ఎవరూ డ్రామాలు చేయలేదని అమిత్ షా గుర్తు చేశారు. హక్కుల కార్యకర్త, జర్నలిస్ట్ తీస్తా సెతల్వాద్ పాత్రను ప్రస్తావించారు. ‘‘తీస్తా సెతల్వాద్ ఎన్జీవో ఈ పని చేసిందని అందరికీ తెలుసు. యూపీఏ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఎన్జీవోకి సాయమందించింది’’ అని అమిత్ షా చెప్పారు. 

‘‘అల్లర్లకు ప్రధాన కారణం గోద్రా రైలుకు నిప్పంటించడం. అప్పుడు 60 మంది చనిపోయారు. తల్లి ఒడిలో కూర్చున్న 16 రోజుల చిన్నారి కూడా మంటలకు ఆహుతైపోయింది. నేనే అంత్యక్రియలను నా చేతులతో నిర్వహించాను. అల్లర్లకు నేపథ్యం ఇది. మిగిలినదంతా రాజకీయ ప్రేరేపితం. గుజరాత్ ప్రభుత్వం ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించలేదు. వెంటనే ఆర్మీని పిలిచింది. ఆర్మీ రావడానికి కొంత సమయం పట్టింది. అయినా, ఒక్క రోజు కూడా ఆలస్యం కాలేదు. దీన్ని కోర్టు కూడా ప్రశంసించింది ’’ అని అమిత్ షా వివరించారు.
amith shah
Narendra Modi
godra riots
gujarat
clen chit
Supreme Court
motivated

More Telugu News