Karnataka: యువతి వలలో చిక్కిన బ్యాంకు మేనేజర్.. రూ. 5.70 కోట్ల బదిలీ

Bank manager held for diverting Over Rs 5 crore to girlfriend
  • డేటింగ్ యాప్ ద్వారా బ్యాంకు మేనేజర్‌కు యువతి పరిచయం
  • డబ్బులు కావాలనగానే పలు విడతలుగా కోట్ల రూపాయల బదిలీ
  • ఓ ఖాతాదారుడి డిపాజిట్ నుంచి డబ్బుల బదిలీ
  • ఆరు రోజుల వ్యవధిలో 136 లావాదేవీలు
  • అనుమానంతో ఆరా తీసిన అధికారులు
  • కటకటాల వెనక్కి బ్యాంకు మేనేజర్
డేటింగ్ యాప్‌ల పేరుతో జరుగుతున్న మోసాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నా కొందరు మాత్రం వాటి వెనక పడడం మాత్రం మానుకోవడం లేదు. బెంగళూరులో తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. డేటింగ్ యాప్ ఉచ్చులో చిక్కుకున్న బ్యాంకు మేనేజర్ ఇప్పుడు కటకటాలు లెక్కపెట్టుకుంటున్నారు. 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని హనుమంతనగర్‌లో ఉన్న ఇండియన్ బ్యాంకు శాఖకు హరిశంకర్ మేనేజర్‌గా ఉన్నారు. మూడు నెలల క్రితం డేటింగ్ యాప్ ద్వారా ఆయనకో యువతి పరిచయమైంది. ఈ క్రమంలో ఓ రోజు తనకు అత్యవసరంగా డబ్బులు కావాలని అడగడంతో మరో ఆలోచన లేకుండా తన ఖాతాలో ఉన్న రూ. 12 లక్షలను హరిశంకర్ ఆమెకు పంపించారు.

ఆ తర్వాత కూడా పలుమార్లు ఆమె డబ్బులు అడగడంతో బ్యాంకులోని ఓ ఖాతాదారుడి డిపాజిట్ నుంచి పలు విడతలుగా ఏకంగా రూ. 5.70 కోట్లు ఓవర్ డ్రాఫ్ట్ (OD) చేశారు. మే 13 నుంచి 19 మధ్య ఆరు రోజుల వ్యవధిలో 136 సార్లు ఓడీ చేయడంతో అనుమానించిన ఉన్నతాధికారులు ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బ్యాంకు రీజనల్ మేనేజర్ డీఎస్ మూర్తి ఫిర్యాదు మేరకు మేనేజర్ హరిశంకర్, అసిస్టెంట్ మేనేజర్ కౌసల్య, క్లర్క్ మునిరాజుపై కేసు నమోదు చేసిన పోలీసులు హరిశంకర్‌ను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. 

డేటింగ్ యాప్ ముసుగులో తాను సైబర్ క్రిమినల్స్ చేతిలో మోసపోయినట్టు హరిశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, బ్యాంకు మేనేజర్‌ను మోసం చేసిన మహిళ అదే బ్యాంకులో రూ. 1.3 కోట్లు తన పేరున ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసింది. ఆ తర్వాత రూ. 75 లక్షల రుణం కూడా తీసుకుంది. బ్యాంకు ఖాతా తెరిచే సమయంలో ఆ మహిళ సంబంధిత పత్రాలు సమర్పించింది. అయితే, ఆరోపణలు ఎదుర్కొంటున్న మేనేజర్ ఆ పత్రాలను తారుమారు చేసి, వాటిని సెక్యూరిటీగా ఉపయోగించి ఓవర్‌డ్రాఫ్ట్‌గా పలు వాయిదాల ద్వారా రూ. 5.7 కోట్లను ఆమెకు పంపినట్టు పోలీసులు తెలిపారు.

బ్యాంకు అధికారులు చేపట్టిన అంతర్గత విచారణలో.. పశ్చిమ బెంగాల్‌లోని పలు బ్యాంకులకు చెందిన 28 బ్యాంకు ఖాతాలకు, కర్ణాటకలోని రెండు ఖాతాలకు 136 లావాదేవీల ద్వారా నిధులు మళ్లించినట్లు తేలింది. ఈ క్రమంలో హరిశంకర్ తన ఇద్దరు సహచరులైన అసిస్టెంట్ మేనేజర్ కౌసల్య, క్లర్క్ మునిరాజులను కూడా ఉపయోగించుకున్నారు. అయితే, ఈ ఘటనలో వారి ప్రమేయాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు. కేసు దర్యాప్తును చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Karnataka
Indian Bank
Dating App
Cyber Crime

More Telugu News