Team India: బుమ్రా దెబ్బకు రోహిత్​ శర్మ విలవిల!

Jasprit Bumrahs fiery delivery hits Rohit Sharma during practice match
  • లీసెస్టర్ తో వామప్ మ్యాచ్ ఆడుతున్న భారత జట్టు 
  • లీసెస్టర్ తరఫున బరిలోకి దిగిన బుమ్రా, ప్రసిద్ధ్, పంత్, పుజారా
  • తొలిసారి బుమ్రాను ఎదుర్కొని ఇబ్బంది పడ్డ రోహిత్
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం లీసెస్టర్షైర్ కౌంటీ జట్టుతో నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. సాధారణంగా ఏ మ్యాచ్ అయినా భారత ఆటగాళ్లకు ప్రత్యర్థి జట్టులోని క్రికెటర్లతో పోటీ ఎదురవుతుంది. కానీ, ఈ మ్యాచ్ లో మాత్రం భారత్ కు భారత ఆటగాళ్లే ప్రత్యర్థులయ్యారు. ఇది అనధికార మ్యాచ్‌ కావడంతో ఎక్కువ మందికి ప్రాక్టీస్‌ అవకాశం కల్పించేందుకు జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, రిషబ్ పంత్‌, చటేశ్వర్ పుజారా లీసెస్టర్‌షైర్‌ తరఫున బరిలోకి దిగారు.

    ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు లీసెస్టర్ కౌంటీ బౌలర్లతో పాటు బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. తన యార్కర్లు, బౌన్సర్లతో ప్రత్యర్థులను హడలెత్తించే భారత స్టార్‌ పేసర్‌ బుమ్రా.. ఎదురుగా ఉన్నది మనోళ్లే కదా అని  ఏమాత్రం తగ్గలేదు. భారత కెప్టెన్ రోహిత్‌ శర్మకు తన బౌలింగ్‌ పదును చూపెట్టాడు. ఐపీఎల్లో చాన్నాళ్ల నుంచి ముంబైకి కలిసి ఆడుతున్న ఈ ఇద్దరూ ఇలా ఒక మ్యాచ్ లో ప్రత్యర్థులుగా ఆడటం ఇదే తొలిసారి. సాధారణంగా నెట్స్ లో మాత్రమే బుమ్రా బౌలింగ్ ను ఎదుర్కొనే హిట్ మ్యాన్ మొదటి సారి ఒక మ్యాచ్ లో అతని బౌలింగ్ ను ఎదుర్కొన్నాడు. 

ఈ ఇద్దరి మధ్య పోరులో రోహిత్ పై బుమ్రాదే పైచేయి అయింది. బుమ్రా వేసిన బంతులకు భారత కెప్టెన్ ఇబ్బంది పడుతూ కనిపించాడు. ఈ క్రమంలో ఏడో ఓవర్లో బుమ్రా వేసిన ఓ పదునైన బంతి రోహిత్‌కు గజ్జల్లో బలంగా తగిలింది. నొప్పికి తట్టుకోలేక భారత కెప్టెన్‌ కాసేపు మోకాళ్లపై కూర్చుండిపోయాడు. దాంతో, అంతా కంగారు పడ్డారు. జట్టు ఫిజియో వచ్చి అతడిని పరీక్షించాడు. ఆ తర్వాత రోహిత్‌ బ్యాటింగ్‌ కొనసాగించడంతో అందరూ  ఊపిరిపీల్చుకున్నారు.
Team India
Rohit Sharma
bumrah
ball
hit
england tour
practice match
rishabh pant
Cheteshwar Pujara

More Telugu News