Schizophrenia: స్కిజోఫ్రినియా వంటి మొండి జబ్బులను తొలిదశలోనే గుర్తించే సెన్సర్... రూపకల్పన చేసిన ఐఐటీ రూర్కీ పరిశోధకులు

  • మొండి వ్యాధుల చికిత్సకు కీలక ముందడుగు
  • ప్రారంభ దశలోనే గుర్తించే సౌలభ్యం
  • గ్రాఫీన్, సల్ఫర్, బోరాన్ తో సెన్సర్ల తయారీ
  • డోపమైన్ స్థాయులను గుర్తించే సెన్సర్
IIT Roorkee researchers invents a sensor to identify early signs of schizophrenia and Parkinson

మానసిక వ్యాధుల్లో అత్యంత ప్రమాదకరమైనదిగా స్కిజోఫ్రినియా గురించి చెబుతుంటారు. ఇది మనిషిని జీవచ్ఛవంలా మార్చేస్తుంది. పార్కిన్సన్ వ్యాధి కూడా తీవ్రమైనదే. మెదడులో లోపం కారణంగా కేంద్ర నాడీ వ్యవస్థ క్రమంగా అచేతనమవుతుంది. ఇదే అనేక దుష్పరిణామాలకు దారితీస్తుంది. అయితే, ఈ విధమైన మొండి వ్యాధులను ప్రారంభదశలోనే గుర్తించే అద్భుతమైన సెన్సర్ కు ఐఐటీ రూర్కీ పరిశోధకులు రూపకల్పన చేశారు. 

ఈ సెన్సర్ మెదడులో జరిగే రసాయన చర్యలను పరిశీలిస్తుంది. మనిషి భావోద్వేగాలకు కారణమయ్యే డోపమైన్ స్థాయులను సరిగ్గా అంచనావేస్తుంది. డోపమైన్ హెచ్చుతగ్గుల కారణంగానే మానసిక, మెదడు సంబంధిత నరాల వ్యాధులు ఉత్పన్నమవుతాయి. ఈ రసాయన పదార్థం పరిమాణంలో కొంచెం తేడా వచ్చినా ఈ సెన్సర్ పసిగడుతుంది. తద్వారా, స్కిజోఫ్రినియా, పార్కిన్సన్ వ్యాధులను తొలిదశలో గుర్తించగలిగే వీలుంటుంది. 

దురదృష్టకరమైన విషయం ఏమిటంటే... ఈ తరహా వ్యాధులను పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు. అందుకే, తొలినాళ్లలోనే గుర్తిస్తే వ్యాధులు మరింత ముదరకుండా నియంత్రించవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. కాగా, ఐఐటీ రూర్కీ పరిశోధక బృందం గ్రాఫీన్ అనే పదార్థాన్ని సల్ఫర్, బోరాన్ లతో సమ్మిళితం చేసి ఈ సెన్సార్లను రూపొందించింది.

ఈ పరిశోధనకు ఫిజిక్స్ డిపార్ట్ మెంట్ కు చెందిన ప్రొఫెసర్ సౌమిత్ర సత్పతి నేతృత్వం వహించారు. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు ప్రఖ్యాత నేచుర్ సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్ ఓ ప్రచురితమయ్యాయి.

More Telugu News