Vetrivel: రూ.10 నాణేలు పోగు చేసి కారు కొన్నాడు... ఎందుకంటే...!

  • మీడియా దృష్టిని ఆకర్షించిన డాక్టర్ వెట్రివేల్
  • రూ.10 నాణేలు చెల్లవనే ప్రచారాన్ని తిప్పికొట్టిన వైనం
  • రూ.10 నాణేలు చట్టబద్ధమైనవేనని స్పష్టీకరణ
Tamilnadu doctor buys a car with all ten rupees coins

తమిళనాడుకు చెందిన 27 ఏళ్ల వెట్రివేల్ ఇటీవల మీడియా దృష్టిని ఆకర్షించాడు. రూ.6 లక్షల విలువైన రూ.10 నాణేలు పోగు చేసి వెట్రివేల్ ఓ కారును కొనుగోలు చేశాడు. వృత్తిరీత్యా వైద్యుడైన వెట్రివేల్ ఇదేమీ సరదా కోసం చేయలేదు. దీని వెనుక బలమైన సామాజిక కారణం ఉంది. 

వెట్రివేల్ కుటుంబం స్మార్ట్ కిడ్స్ పబ్లిక్ స్కూల్ పేరిట ఓ పాఠశాలను నిర్వహిస్తోంది. ఆ పాఠశాలకు చెందిన చిన్నారులు రూ.10 నాణేలను ఉత్త రేకు బిళ్లలుగా భావిస్తూ ఆడుకోవడం వెట్రివేల్ గమనించాడు. రూ.10 నాణేలు చెల్లవని సమాజంలో జరుగుతున్న ప్రచారం కారణంగానే, ఆ పది రూపాయల నాణేలు చిన్న పిల్లల చేతిలో ఆటవస్తువులుగా మారాయని గుర్తించాడు. దాంతో, రూ.10 నాణేలు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని నిరూపించాలని ఆ క్షణమే అతడు నిశ్చయించుకున్నాడు. 

ఆ తర్వాత మరో సంఘటనతో అతడి సంకల్పం మరింత బలపడింది. ఓ రెస్టారెంటుకు వెళ్లిన వెట్రివేల్ బిల్లు చెల్లించే సమయంలో రూ.10 నాణెం ఇవ్వగా, క్యాషియర్ తిరస్కరించడం వెట్రివేల్ ను అసంతృప్తికి గురిచేసింది. ఎందుకు తీసుకోవని నిలదీయగా, ఆ క్యాషియర్ దురుసుగా మాట్లాడడం వెట్రివేల్ పట్టుదలను రెట్టింపు చేసింది. 

పైగా, ఫేక్ నాణేలు ఇస్తున్నారంటూ ఆ క్యాషియర్ వాదించడం ఈ తమిళ యువకుడిని వెంటనే కార్యరంగంలోకి దూకేలా పురిగొల్పింది. కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటులో రూ.10 నాణేలు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని చేసిన ప్రకటనతో వెట్రివేల్ మరింత ధైర్యం తెచ్చుకున్నాడు. 

నెలరోజుల వ్యవధిలో రూ.6 లక్షల విలువైన రూ.10 నాణేలు సేకరించాడు. వాటిసాయంతో ఓ కారు కొనుగోలు చేసి, రూ.10 నాణేలు కూడా చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని అందరికీ చాటాలని నిర్ణయించుకున్నాడు. ఆ మేరకు కారు డీలర్ ను ఒప్పించి, అన్నీ రూ.10 నాణేలతోనే కారు కొనుగోలు చేశాడు. తన చర్య మరింత మందిని ఈ దిశగా చైతన్యవంతులను చేస్తుందని డాక్టర్ వెట్రివేల్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.

More Telugu News