Agnipath Scheme: ‘అగ్నిపథ్’ ఆగదు.. నిరసనల్లో పాల్గొన్న వారికి సైన్యంలో చోటులేదు: లెఫ్టినెంట్ జనరల్ అనిల్‌పురి

  • ఇకపై నియామకాలన్నీ అగ్నిపథ్ పథకం ద్వారానేనన్న అనిల్‌పురి
  • శిక్షణ సామర్థ్యాన్ని 1.20 లక్షలకు పెంచుతామని స్పష్టీకరణ
  • విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతే కోటి రూపాయల పరిహారం
  • నేవీలో మహిళలకూ అవకాశం కల్పిస్తామన్న లెఫ్టినెంట్ జనరల్
  • వారు యుద్ధ నౌకలపై పనిచేయాల్సి ఉంటుందని స్పష్టీకరణ
No rollback of Agnipath scheme all concessions pre planned says Anil Puri

త్రివిధ దళాల్లో నియామకం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న వేళ రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది. ‘అగ్నిపథ్’ విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పింది. ఇకపై నియమకాలన్నీ కొత్త పథకం ద్వారానే జరుగుతాయని సైనిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పురి తెలిపారు.

అగ్నిపథ్‌పై యువకులు తమ నిరసనను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే సైనిక ర్యాలీల్లో పాల్గొని శారీరక, వైద్య, ప్రవేశ పరీక్షలు పూర్తి చేసి అపాయింట్‌మెంట్ లెటర్ కోసం ఎదురుచూస్తున్న వారు కూడా మళ్లీ అగ్నిపథ్ పథకం కింద దరఖాస్తు చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఇటువంటి వారి కోసం వయసు పరిమితిని ఈ ఏడాది 23 ఏళ్లకు పెంచినట్టు చెప్పారు. 

అగ్నిపథ్ పథకం కింద వైమానిక దళంలో ఈ నెల 24 నుంచి నమోదు ప్రక్రియ ఆరంభం అవుతుందని, జులై 24 నుంచి తొలి దశ ఆన్‌లైన్ పరీక్ష ప్రక్రియ ప్రారంభమవుతుందని అనిల్ పురి తెలిపారు. డిసెంబరు చివరి నాటికి అగ్నివీర్ తొలి బ్యాచ్ నియామకం జరుగుతుందని, అదే నెల 30 నుంచి శిక్షణ కూడా మొదలవుతుందని పేర్కొన్నారు. నేవీలో నియామకాల కోసం ఈ నెల 25న మార్గదర్శకాలు విడుదలవుతాయని, నవంబరు 21 కల్లా మొదటి దశ బ్యాచ్ శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. నేవీలో మహిళలకూ అవకాశం కల్పిస్తామని, వీరు యుద్ధ నౌకల్లోనూ విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 

ఆర్మీలో నియామకాల కోసం నేడు ముసాయిదా నోటిఫికేషన్ వెలువడుతుందన్నారు. ‘జాయిన్ ఇండియా’ వెబ్‌సైట్ ద్వారా జులై 1 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రెండు బ్యాచ్‌లుగా నియమకాలు జరుగుతాయని, తొలి బ్యాచ్‌లో 25 వేల మందిని డిసెంబరు రెండో వారానికల్లా నియమిస్తారని లెఫ్టినెట్ జనరల్ తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రెండో బ్యాచ్ నియామకం జరుగుతుందని, రెండింటిలో కలిపి మొత్తంగా 40 వేల మందిని నియమిస్తామన్నారు. ప్రస్తుతం సైనిక దళాల వద్ద 60 వేల మందికి శిక్షణనిచ్చే సామర్థ్యం ఉందని, దానిని క్రమంగా 90 వేల నుంచి 1.20 లక్షలకు తీసుకెళ్తామన్నారు.

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయే అగ్నివీరులకు కోటి రూపాయల వరకు బీమా, పరిహారం లభిస్తుందన్నారు. 18 ఏళ్ల లోపు అభ్యర్థుల నియామకానికి సంబంధించి వారి తల్లిదండ్రులు, లేదంటే సంరక్షకులు సంతకాలు చేయాల్సి ఉంటుందని వాయుసేన తెలిపింది. కాగా, అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో పాల్గొన్న వారికి సైనిక దళాల్లో ప్రవేశం లేదని లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పురి తెలిపారు.

More Telugu News