ఐటీపీఓ టన్నెల్ ప్రారంభోత్సవానికి వచ్చి చెత్త ఏరిన ప్రధాని మోదీ... వైరల్ అవుతున్న వీడియో ఇదిగో
- ఢిల్లీలో రూ.920 కోట్లతో ఐటీపీఓ టన్నెల్ నిర్మాణం
- ఆదివారం ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
- కారిడార్‌లో పెంకులు, కూల్ డ్రింక్ బాటిళ్లను స్వయంగా తీసిన ప్రధాని
- మోదీ అంకిత భావాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్న ప్రముఖులు
దేశ రాజధాని ఢిల్లీలో రూ.920 కోట్లతో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్‌ను ప్రారంభించేందుకు ఆదివారం ఉదయం ప్రధాని మోదీ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కొత్త నిర్మాణాన్ని పరిశీలించేందుకు ఒంటరిగా కారిడార్‌లోకి ప్రవేశించిన మోదీ... అక్కడ కనిపించిన చిన్న చిన్న పెంకులను స్వయంగా వంగి మరీ తన చేతులతో తీశారు. ఆ తర్వాత అటుగా నడుస్తూ కారిడార్ గోడకు అనుకుని పడిపోయిన ఓ కూల్ డ్రింక్ బాటిల్‌ను కూడా మోదీ తన చేతులతోనే తీశారు. ఈ దృశ్యాలకు చెందిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ కాగా... ప్రముఖులు మోదీ అంకిత భావాన్ని ఆకాశానికెత్తేస్తూ వరుసబెట్టి స్పందిస్తున్నారు. దీంతో ఈ వీడియో క్షణాల్లోనే వైరల్‌గా మారిపోయింది.