Harish Rao: మరి యూపీలో అల్లర్ల వెనుక యోగి ఉన్నాడా?: బండి సంజయ్ కు హరీశ్ రావు ప్రశ్న

Harish Rao dismisses Bandi Sanjay allegations over Secunderabad riots
  • సైనిక నియామకాల కోసం అగ్నిపథ్
  • దేశంలో పలుచోట్ల నిరసన జ్వాలలు
  • నిన్న సికింద్రాబాద్ లో హింస
  • బీజేపీ ప్రతి ఒక్కరి ఉసురు పోసుకుంటోందన్న హరీశ్
అగ్నిపథ్ సైనిక నియామక విధానాన్ని వ్యతిరేకిస్తూ నిన్న సికింద్రాబాద్ లో జరిగిన తీవ్ర హింస దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. దీనిపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు స్పందించారు. సికింద్రాబాద్ విధ్వంసం వెనుక టీఆర్ఎస్ ఉందని బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ ఆరోపించడంలో అర్థంలేదని అన్నారు. 

సికింద్రాబాద్ లో టీఆర్ఎస్ చేయించినట్టయితే, మరి ఉత్తరప్రదేశ్ లో ఓ పోలీస్ స్టేషన్ పైనే ఆందోళనకారులు దాడిచేశారని, ఆ దాడి యోగి ఆదిత్యనాథ్ చేయించారా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. బీహార్ లోనూ నిరసనకారులు రైల్వేస్టేషన్లపై దాడి చేశారని, ఆ దాడులు సీఎం నితీశ్ చేయించారా? అని నిలదీశారు. 

కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పేరిట తీసుకున్న నిర్ణయంతో యావత్ దేశం అట్టుడికిపోతోందని అన్నారు. ప్రతి ఒక్కరి ఉసురు పోసుకుంటున్న బీజేపీ, ఆఖరికి సైన్యాన్ని కూడా ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తోందని హరీశ్ రావు విమర్శించారు. ఆర్మీ ఉద్యోగాలను సైతం యువతకు దూరం చేస్తున్న కేంద్రం, అగ్నిపథ్ నియామక విధానం యువతకు అర్థంకాలేదని అనడం హాస్యాస్పదమని పేర్కొన్నారు.
Harish Rao
Riots
Secunderabad
Bandi Sanjay
Agnipath Scheme

More Telugu News