Sai Pallavi: వివాదంలో చిక్కుకున్న సాయిపల్లవి.. కశ్మీరీ పండిట్ల ఊచకోతపై వివాదాస్పద వ్యాఖ్యలు!

Sai Pallavi in controversy after commenting on Kashmiri Pandits
  • కశ్మీరీ పండిట్ల ఊచకోతకు, ఆవులను రక్షించేందుకు చేసిన దాడికి లింక్ పెట్టిన సాయిపల్లవి
  • రెండింటికీ తేడా లేదని వ్యాఖ్య
  • సాయిపల్లవిపై వెల్లువెత్తుతున్న విమర్శలు
ఎప్పుడూ ఎంతో కూల్ గా ఉండే సినీ నటి సాయిపల్లవి పెను వివాదంలో చిక్కుకుంది. జమ్మూకశ్మీర్ లో ఊచకోతకు గురైన కశ్మీరీ పండిట్ల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మతం పేరుతో జరిగే హింసకు తాను వ్యతిరేకమని ఆమె చెప్పింది. ఈ క్రమంలో ఆమె మాట్లాడిన మాటలు ఆమెను ఇబ్బందుల్లోకి తోసేశాయి.

'గతంలో కశ్మీరీ పండిట్లను ఎలా చంపారనే విషయాన్ని 'కశ్మీర్ ఫైల్స్' సినిమాలో చూపించారు. ఈ విషయాన్ని మీరు మతపరమైన సంఘర్షణగా చూస్తున్నట్టయితే... అలాంటిదే ఇటీవల మరొక ఘటన జరిగింది. తన వాహనంలో ఆవులను తీసుకెళ్తున్న ఒక ముస్లిం వ్యక్తిపై దాడి చేశారు. జైశ్రీరాం అని నినదిస్తూ అతనిపై దాడికి పాల్పడ్డారు. అప్పుడు కశ్మీరీ పండిట్లపై జరిగిన దానికి, ఇప్పుడు ముస్లిం వ్యక్తిపై జరిగిన దానికి తేడా ఏముంది?' అని ఆమె ప్రశ్నించారు. ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 

సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. సోషల్ మీడియాలో కొందరు ఆమె వ్యాఖ్యలను స్వాగతిస్తుండగా... చాలా మంది తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఒక జాతిపై జరిగిన మారణహోమానికి, ఆవులను రక్షించేందుకు జరిగిన దాడికి తేడా లేదా? అని ఆమెపై మండిపడుతున్నారు. జాతీయ మీడియా సైతం సాయి పల్లవి వ్యాఖ్యలకు సంబంధించిన కథనాలను ప్రసారం చేస్తోంది. 

ఈ నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా ఒక కశ్మీరీ హిందూ వ్యక్తి స్పందిస్తూ సాయి పల్లవి వ్యాఖ్యల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ముస్లింను కొట్టడానికి, ఒక జాతినే కూకటివేళ్లతో పెకిలించి వేయాలనుకోవడానికి చాలా తేడా ఉందని ఆయన అన్నారు. తమ మనసుల్లో ఉన్న అంతులేని వ్యథను తగ్గించే ప్రయత్నం చేయవద్దని చెప్పారు. ఇక్కడికు వచ్చి ముక్కలైన తమ హృదయాలను, ధ్వంసమైన తమ ఇళ్లను చూడాలని అన్నారు. ఒక జాతిని నిర్మూలించడానికి చేసిన మారణహోమానికి తాము సాక్షులమని చెప్పారు. న్యాయం కోసం తాము ఎదురు చూస్తున్నామని అన్నారు.
Sai Pallavi
Tollywood
Kashmiri Pandits
Cow
Muslims

More Telugu News