KCR: కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ ఢిల్లీలో భారీ హోర్డింగ్.. కాసేపటికే తొలగింపు

  • ప్రతిపక్షాల సమావేశానికి టీఆర్ఎస్ దూరం
  • విపక్ష నేతలు సమావేశమైన క్లబ్‌ ఎదురుగా భారీ హోర్డింగ్ ఏర్పాటు
  • ‘దేశ్ కా నేత కేసీఆర్’ అని పేర్కొంటూ ఆహ్వానం
KCRs Huge Hoarding in Delhi removed after some time

ప్రతిపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతను నెత్తికెత్తుకున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిన్న ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్ సహా పలువురు నేతలకు లేఖలు పంపారు. మమత లేఖను వైసీపీ పట్టించుకోకపోగా, టీఆర్ఎస్ మాత్రం తాము రాబోమని తేల్చి చెప్పింది. కాంగ్రెస్, బీజేపీయేతర కూటమే తన లక్ష్యమని పదేపదే చెబుతున్న కేసీఆర్.. ఈ సమాశానికి కాంగ్రెస్‌ను కూడా ఆహ్వానించడంతో రాబోమని స్పష్టంగా చెప్పేశారు. 

కేసీఆర్ కానీ, ఆ పార్టీ ప్రతినిధులు కానీ ఈ సమావేశానికి హాజరు కాకున్నా దేశ రాజధానిలో కేసీఆర్‌ను ఆహ్వానిస్తూ భారీ హోర్డింగ్ ఏర్పాటు చేయడం విశేషం. ప్రతిపక్షాలు సమావేశమైన కానిస్టిట్యూషన్ క్లబ్ ఎదుట ఏర్పాటు చేసిన ఈ హోర్డింగులో.. ‘దేశ్‌ కా నేత కేసీఆర్. ఢిల్లీకి హృదయపూర్వక స్వాగతం. తెలంగాణ వికాస పురుషుడు, విఖ్యాత కేసీఆర్ దేశానికి కొత్త దిశను ఇచ్చేందుకు వస్తున్నారు. భారతీయ రాష్ట్ర సమితి పార్టీతో కేసీఆర్ దేశ ప్రజలను ఉత్థాన స్థితికి తీసుకెళ్తారు’ అని రాసివుంది. అయితే, ఆ తర్వాత కాసేపటికే ఆ హోర్డింగును తొలగించారు. ఈ హోర్డింగును ఎవరు ఏర్పాటు చేశారు? ఎందుకు తీసేశారు? అన్న ప్రశ్నలు ఇప్పుడు అందరినీ వెంటాడుతున్నాయి.

More Telugu News