Revanth Reddy: నలుగురు ఐపీఎస్ ల చేతిలో 15 శాఖలు ఉన్నాయి: రేవంత్ రెడ్డి

15 departments are in hands of 4 IPS officers says Revanth Reddy
  • సమర్థులైన పోలీసు అధికారులను పక్కన పెడుతున్నారన్న రేవంత్ 
  • ఒక అధికారి ఏడున్నరేళ్లుగా ఒకే స్థానంలో ఉన్నారంటూ విమర్శ 
  • హైదరాబాద్ లో శాంతిభద్రతలు క్షీణించాయని వ్యాఖ్య 
తెలంగాణ పోలీసు శాఖలో సమర్థులైన అధికారులను పక్కన పెట్టి, సామాజిక కోణాల్లో పోస్టింగులు ఇస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పదోన్నతి పొందిన వారిని కూడా ఖాళీగా కూర్చోబెట్టారని అన్నారు. కొందరు ఐపీఎస్ లకు రెండు కంటే ఎక్కువ శాఖలను అప్పగించారని విమర్శించారు. ఒక అధికారి ఏడున్నరేళ్లుగా ఒకే స్థానంలో ఉన్నారని అన్నారు. హైదరాబాద్ లో శాంతిభద్రతలు క్షీణించాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో 'బచావో హైదరాబాద్' పేరిట అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

హైదరాబాద్ లో పట్టపగలు కూడా పిల్లలను ఇంటి నుంచి బయటకు పంపే పరిస్థితి లేదని రేవంత్ అన్నారు. శాంతి భద్రతలు అదుపులో ఉండాలంటే సమర్థవంతులకు పోస్టింగులు ఇవ్వాలని చెప్పారు. నలుగురు ఐపీఎస్ ల చేతుల్లో 15 శాఖలు ఉన్నాయని అన్నారు. నిజాయతీగా పని చేసే ఐపీఎస్ అధికారులను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారని విమర్శించారు. కేసీఆర్ తన తొత్తులకే పోస్టింగులు ఇస్తున్నారని అన్నారు. కేసీఆర్ తనకు నచ్చినోళ్లకు నజరానాలు, నచ్చనోళ్లకు జరిమానాలు ఇస్తున్నారని చెప్పారు.
Revanth Reddy
Congress
KCR
TRS
Police

More Telugu News