Chandrababu: ఈరోజు నుంచే చంద్రబాబు జిల్లాల పర్యటన!

Chandrababu district tours to start from today
  • 'ఎన్టీఆర్ స్ఫూర్తి - చంద్రన్న భరోసా' పేరుతో చంద్రబాబు పర్యటనలు
  • అనకాపల్లి జిల్లా నుంచి పర్యటనలు ప్రారంభం
  • ఒక్కో జిల్లాలో మూడు రోజులు గడపనున్న చంద్రబాబు

వచ్చే ఎన్నికలకు టీడీపీ శ్రేణులను సమాయత్తం చేయడమే లక్ష్యంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు తలపెట్టిన జిల్లాల పర్యటన ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. 'ఎన్టీఆర్ స్ఫూర్తి - చంద్రన్న భరోసా' పేరుతో ఈ పర్యటన కొనసాగనుంది. అనకాపల్లి జిల్లా నుంచి ఆయన జిల్లాల పర్యటన ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా పలు జిల్లాల్లో మినీ మహానాడు కార్యక్రమాలను నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈరోజు అనకాపల్లి జిల్లా చోడవరంలో తొలి మహానాడు జరగనుంది. 

వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ చంద్రబాబు జిల్లాల పర్యటన కొనసాగనుంది. జిల్లాల పర్యటనలో భాగంగా ప్రతి జిల్లాలో మూడు రోజుల పాటు చంద్రబాబు గడపనున్నారు. ఈ మూడు రోజుల్లో తొలిరోజు మహానాడు నిర్వహిస్తారు. రెండో రోజు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తారు. మూడో రోజు ప్రజా సమస్యలు, ప్రభుత్వ బాదుడే బాదుడుపై రోడ్ షోలు నిర్వహిస్తారు. పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపడమే లక్ష్యంగా ఈ పర్యటనలు కొనసాగనున్నాయి. ఈ ఏడాది దాదాపు 100 నియోజకవర్గాల్లో పర్యటించాలనే లక్ష్యాన్ని చంద్రబాబు నిర్దేశించుకున్నారు.

  • Loading...

More Telugu News