Narendra Modi: ముంబయిలో ఒకే వేదికపై ప్రధాని మోదీ, సీఎం ఉద్ధవ్ థాకరే

  • మహారాష్ట్రలో మోదీ పర్యటన
  • మోదీకి స్వాగతం పలికిన సీఎం థాకరే
  • ఇరువురు ముంబయిలో పలు కార్యక్రమాలకు హాజరు 
Modi and Thackeray on same stage in Mumbai

ప్రధాని నరేంద్ర మోదీ నేడు మహారాష్ట్రలో పర్యటించారు. ఈ సందర్భంగా ముంబయిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బీజేపీ, శివసేన మధ్య విభేదాలు భగ్గుమంటున్న నేపథ్యంలో... ప్రధాని మోదీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ఒకే వేదికపై కనిపించారు. అంతకుముందు, కొలాబాలోని ఐఎన్ఎస్ షిక్రా నేవీ హెలీపోర్ట్ వద్ద సీఎం థాకరే ప్రధాని మోదీకి స్వాగతం పలకడం విశేషం. 

ఆపై మోదీ, థాకరే రాజ్ భవన్ కు వెళ్లి అక్కడ ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్ భవన్ లో ప్రధాని మోదీ జల్ భూషణ్ భవంతిని, స్వాతంత్ర్య సమరవీరుల గ్యాలరీని ప్రారంభించారు. దీనిపై సీఎం ఉద్ధవ్ థాకరే తన ప్రసంగంలో ప్రస్తావించారు. గ్యాలరీ ఆఫ్ రివల్యూషనరీస్ ను ప్రధాని ప్రారంభించడం ఓ శుభ సందర్భం అని పేర్కొన్నారు. స్వాతంత్ర్య పోరాట గాథను సజీవంగా నిలుపుకోవడం మన కర్తవ్యం అని, నాడు దాస్య శృంఖలాల నుంచి విముక్తి కోసం జరిగిన పోరాటంలో ఏం జరిగిందనేది భావితరాల వారికి తెలియజేయడంలో ఈ గ్యాలరీ కీలకపాత్ర పోషిస్తుందని సీఎం థాకరే అభిప్రాయపడ్డారు. 

ఈ కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ, సీఎం థాకరే ముంబయి సమాచార్ ద్విశతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు బాంద్రా కుర్లా కాంప్లెక్స్ కు తరలి వెళ్లారు. కాగా, గత ఏప్రిల్ లో ప్రధాని మోదీ ముంబయి వచ్చి లతా మంగేష్కర్ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం థాకరే డుమ్మాకొట్టడంతో బీజేపీ-శివసేన మధ్య వైరం పతాకస్థాయికి చేరిందని భావించారు.

More Telugu News