Asaduddin Owaisi: ఎంఐఎం చీఫ్ అసద్‌కు కృతజ్ఞతలు తెలిపిన బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ

Varun Gandhi Grateful To Owaisi For Sharing Jobs Data
  • దేశవ్యాప్తంగా ఉన్న ఖాళీల వివరాలను వెల్లడించిన వరుణ్ గాంధీ
  • తన ప్రసంగంలో వాటిని ప్రస్తావించిన అసద్
  • అసద్ వీడియోను షేర్ చేసిన వరుణ్ గాంధీ
ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్ బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీకి ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్న వేళ కేంద్ర, రాష్ట్రాల్లో మంజూరైన 60 లక్షల ఉద్యోగాలు ఇంకా ఖాళీగా ఉన్నాయంటూ వరుణ్ గాంధీ ఇటీవల గణాంకాల డేటాను బయటపెట్టారు. 

అసద్ ఇటీవల ప్రసంగిస్తూ విభాగాల వారీగా ఆ డేటాను ప్రస్తావించారు. తాను విడుదల చేసిన గణాంకాలను ప్రస్తావించిన అసదుద్దీన్‌కు వరుణ్ కృతజ్ఞతలు చెబుతూ ఆయన ప్రసంగ వీడియోను షేర్ చేశారు. ‘‘నిరుద్యోగంపై నా ప్రశ్నలను తన ప్రసంగంలో లేవనెత్తినందుకు ఒవైసీజీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’’ అని వరుణ్ గాంధీ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

దేశంలో ఇప్పుడు నిరుద్యోగం తీవ్ర సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేసిన వరుణ్ గాంధీ దేశవ్యాప్తంగా ఉన్న నేతలు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. నిరుద్యోగులకు న్యాయం జరగాలన్నారు. అప్పుడు మాత్రమే దేశం శక్తిమంతమవుతుందని పేర్కొన్నారు. 

పలు మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ఉన్న ఖాళీలను వివరిస్తూ వరుణ్ గాంధీ ఇటీవల గ్రాఫిక్స్ ద్వారా వివరాలను వెల్లడించారు. గత మూడు దశాబ్దాల్లో నిరుద్యోగం గరిష్ఠ స్థాయికి చేరుకున్న విషయాన్ని ఈ గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో మంజూరైన 60 లక్షల పోస్టులు ఉన్నప్పటికీ ఉద్యోగాలు దొరక్క కోట్లాదిమంది నిరుద్యోగులు తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారని వరుణ్ పేర్కొన్నారు. మరి వాటికి కేటాయించిన బడ్జెట్ ఏమవుతోందని ప్రశ్నించారు. యువత ఈ విషయాన్ని తెలుసుకోవాలని వరుణ్ సూచించారు. కాగా, ఇటీవల ఆయన ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను లేవనెత్తుతూ సొంత ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తూ వస్తున్నారు.
Asaduddin Owaisi
Varun Gandhi
BJP
Jobs Data
MIM

More Telugu News