Nara Lokesh: మేం వెళ్లి చర్చిస్తే లోకేశ్ మాట్లాడగలరా?: టీడీపీ జూమ్ మీటింగ్‌పై వ‌ల్ల‌భ‌నేని వంశీ కామెంట్‌

bannavaram mla vallabhaneni vamshi comments on nara lokesh challenge on zoom meeting
  • టెన్త్ విద్యార్థుల‌తో నారా లోకేశ్ జూమ్ మీటింగ్‌
  • విద్యార్థుల అకౌంట్ల‌తో ఎంట్రీ ఇచ్చిన వ‌ల్ల‌భ‌నేని, కొడాలి
  • దొంగ‌ల మాదిరిగా వ‌చ్చార‌న్న లోకేశ్, అచ్చెన్న‌
  • లోకేశ్ ఆరోప‌ణ‌ల‌పై ఘాటుగా స్పందించిన వ‌ల్ల‌భ‌నేని వంశీ
  • త‌మ మాట‌ల‌ను చూపించ‌డానికి భ‌య‌మేమిట‌ని ప్ర‌శ్న‌
టెన్త్ విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రుల‌తో టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ నిర్వ‌హించిన జూమ్ మీటింగ్‌లోకి ఎమ్మెల్యేలు వ‌ల్ల‌భ‌నేని వంశీ‌, కొడాలి నాని ఎంట్రీ ఇచ్చిన వ్య‌వ‌హారం ఆస‌క్తి రేపింది. వైసీపీ ఫేక్ పార్టీ కాబ‌ట్టే... ఆ పార్టీ నేత‌లు ఫేక్ ఐడీల‌తో జూమ్ మీటింగ్‌లోకి వ‌చ్చార‌ని లోకేశ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ద‌మ్ముంటే నేరుగా వ‌చ్చి త‌న‌తో మాట్లాడాల‌ని కూడా లోకేశ్ వారికి స‌వాల్ విసిరారు. 

ఈ వ్య‌వ‌హారంపై టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. టీడీపీ జూమ్ మీటింగ్‌లోకి వంశీ, నానిలు దొంగ‌ల్లా చొర‌బ‌డ్డార‌ని, వారిపై పోలీసులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అచ్చెన్న డిమాండ్ చేశారు.

ఇదిలావుంచితే, ఈ వ్య‌వ‌హారంపై త‌న‌ను క‌లిసిన మీడియా ప్ర‌తినిధుల వ‌ద్ద‌ వ‌ల్ల‌భ‌నేని వంశీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. దొంగల్లా కాకుండా నేరుగా త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చి మాట్లాడాల‌ని లోకేశ్ స‌వాల్ చేస్తున్నార‌ని మీడియా ప్ర‌స్తావించ‌గా... తాము వెళ్లి చ‌ర్చిస్తే లోకేశ్ మాట్లాడ‌గ‌ల‌రా? అంటూ ఆయ‌న స్పందించారు. 

అయినా తామేమీ జూమ్ మీటింగ్‌లోకి దొంగల్లా ప్ర‌వేశించ‌లేద‌ని, చాలా మందిని ఆహ్వానించిన త‌ర్వాతే మీటింగ్ పెట్టారు క‌దా... అందులో గ‌త ప్ర‌భుత్వ విధానాలు, ప్ర‌స్తుత ప్ర‌భుత్వ విధానాలు ఏమిటో చెప్పేందుకే ప్ర‌వేశించామ‌ని వంశీ అన్నారు. అయినా టెన్త్ విద్యార్థుల‌కు ధైర్యం చెప్పాల్సిన లోకేశ్.. అందుకు విరుద్ధంగా త‌మ ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు గుప్పించార‌ని వంశీ చెప్పారు. జూమ్ మీటింగ్‌లో తాము మాట్లాడిన దానిని చూపించ‌డానికి లోకేశ్‌కు భ‌య‌మేంటీ? అని కూడా వంశీ ప్ర‌శ్నించారు.
Nara Lokesh
TDP
YSRCP
Zoom Meeting
Vallabhaneni Vamsi
Kodali Nani
Atchannaidu

More Telugu News