అమలాపురం బయల్దేరిన వీర్రాజు.. రావులపాలెం వరకైతే ఓకేనన్న పోలీసులు
- అమలాపురం అల్లర్ల బాధితుల పరామర్శకు వీర్రాజు పయనం
- జొన్నాడ వద్ద అడ్డుకున్న పోలీసులు
- వీర్రాజు కారుకు అడ్డంగా మరో కారును ఉంచిన పోలీసులు
- పోలీసుల తీరుపై వీర్రాజు ఆగ్రహం
- బయటి వ్యక్తులకు అమలాపురంలో ప్రవేశం నిషిద్ధమన్న ఖాకీలు
- రావులపాలెం వెళ్లేందుకు వీర్రాజుకు పోలీసుల అనుమతి
అమలాపురం అల్లర్లలో గాయపడ్డ బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న తనను అడ్డుకోవడమేమిటని వీర్రాజు ప్రశ్నించారు. అల్లర్ల నేపథ్యంలో ఇంకా పోలీసు ఆంక్షలు కొనసాగుతున్న అమలాపురంలో ప్రముఖుల పర్యటనకు అనుమతించలేమని పోలీసులు ఆయనకు తేల్చిచెప్పారు.
కనీసం తమ పార్టీ నేతలనైనా కలిసేందుకు అనుమతిస్తారా? అని వీర్రాజు అడగగా... బయటి వ్యక్తులను అమలాపురంలోకి అనుమతించబోమంటూ పోలీసులు తెగేసి చెప్పారు. దీంతో రావులపాలెంలోని తమ పార్టీ నేత తల్లి ఇటీవలే మరణించారని, కనీసం ఆ నేత కుటుంబం పరామర్శకు అయినా అనుమతిస్తారా? అని వీర్రాజు అడగగా... రావులపాలెం వరకు అయితే అనుమతిస్తామని పోలీసులు చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.