: ఓజోన్‌కు ముంచుకురానున్న ముప్పు!

ఓజోన్‌ పొరకు ప్రమాదం పొంచి ఉంది. అయితే భూమిమీద నుండి వెలువడే కాలుష్యం వల్ల కాదు... మనకు సుదూరాన ఉన్న ఒక నక్షత్రం నుండి వెలువడుతున్న గామాకిరణాల వల్ల! ఈ కిరణాలవల్ల మన భూమి చుట్టూ ఉన్న ఓజోన్‌ పొర ధ్వంసమయ్యే ప్రమాదముందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలను హవాయ్‌లోని డబ్ల్యూఎంకెక్‌ అబ్జర్వేటరీకి చెందిన గ్రాంట్‌హిల్‌ అనే శాస్త్రవేత్త వెల్లడించారు.

భూమికి ఎనిమిదివేల కాంతి సంవత్సరాల దూరంలో ఒక నక్షత్రం ప్రస్తుతం పేలిపోయే దశ (సూపర్‌నోవా)లో ఉందని గుర్తించిన శాస్త్రవేత్తలు దీనికి డబ్ల్యూఆర్‌ 104 అనే సంకేత నామాన్ని పెట్టారు. ఈ నక్షత్రం మే 30 నుండి రానున్న ఐదు లక్షల సంవత్సరాల్లో ఎప్పుడైనా పేలిపోయి సూపర్‌నోవాగా మారే ప్రమాదముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నక్షత్రం సూపర్‌నోవాగా మారే సమయంలో దానినుండి పెద్ద ఎత్తున గామా కిరణాలు విశ్వంలోకి విడుదలవుతాయి. ఈ కిరణాలు గనుక భూమిని తాకినట్లయితే భూమికి రక్షణ కవచంలా ఉన్న ఓజోన్‌ పొర ధ్వంసమయ్యే ప్రమాదం ఉందని, దీంతో భూమిపై జీవకోటి మనుగడ ప్రశ్నార్ధకమయ్యే పరిస్థితి ఏర్పడనుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

అయితే ఈ నక్షత్రం భూమికి ఏ కోణంలో ఉంది అనే దానిపై ఈ ప్రమాదం ప్రభావం ఆధారపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకవేళ గామాకిరణాలు గనుక భూమిని తాకితే దాని ఫలితంగా అతినీలలోహిత కిరణాల రేడియోధార్మికత 50 శాతం పెరుగుతుంది. దీని ప్రభావం వల్ల ఓజోన్‌ పొర దెబ్బతింటుంది. ఫలితంగా భూమిపై జీవరాశుల ఉనికికే ప్రమాదం వాటిల్లనుందని గ్రాంట్‌హిల్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News