Dharmendra: నేను ఆరోగ్యంగానే ఉన్నాను.. ఆ వార్తలు నమ్మొద్దు: బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర

Dharmendra rubbishes hospitalisation rumours
  • ధర్మేంద్ర తీవ్ర అనారోగ్యంతో బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరినట్టు వదంతులు
  • ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వివరణ ఇచ్చిన సీనియర్ నటుడు
  • మౌనంగా ఉన్నాను తప్పితే అనారోగ్యంగా కాదంటూ వివరణ
తాను ఆసుపత్రి పాలైనట్టు వస్తున్న వార్తలను బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర (86) కొట్టిపడేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మేంద్ర ముంబైలోని బ్రీచ్‌ కాండీ ఆసుపత్రిలో చేరారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందంటూ నిన్న పుకార్లు షికారు చేశాయి. ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. 

తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, వదంతులు నమ్మొద్దని ఆ వీడియోలో అభిమానులకు విజ్ఞప్తి చేశారు. తాను మౌనంగా ఉన్నాను తప్పితే అనారోగ్యంగా లేనని స్పష్టం చేశారు. ఇతరులకు ప్రేమను పంచితే జీవితం అందంగా ఉంటుందన్న ధర్మేంద్ర.. ఇలాంటి వదంతులను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ధర్మేంద్ర ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ఆయన కుమారుడు బాబీడియోల్ కూడా ఖండించారు.  
 
కాగా, నెల రోజుల క్రితం ధర్మేంద్ర రొటీన్ చెకప్‌లో భాగంగా బ్రీచ్ కాండీ ఆసుపత్రికి వెళ్లారు. అప్పట్లో ఆయన ట్విట్టర్ ద్వారా తాను ఆసుపత్రికి ఎందుకు వెళ్లిందీ వెల్లడించారు. నడుం నొప్పి కారణంగా ఆసుపత్రికి వెళ్లానని, కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇప్పుడు మరోమారు ఆయన ఆరోగ్యంపై వదంతులు వ్యాపించడంతో స్పందించి వివరణ ఇచ్చారు. 

భారత చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ధర్మేంద్ర 1960లో ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరా’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత షోలే, చుప్కే చుప్కే, యాదోం కీ బారాత్, సత్యకామ్, సీతా ఔర్ గీతా వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. కరణ్ జొహార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహనీ’ సినిమాలో ధర్మేంద్ర నటిస్తున్నారు. ఇందులో జయాబచ్చన్, షబానీ ఆజ్మీ, అలియా భట్, రణ్‌వీర్ సింగ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.
Dharmendra
Bollywood
Breach Candy Hospital
Bobby Deol

More Telugu News