BJP: అప్పుడు చంద్ర‌బాబు, ఇప్పుడు ప‌వ‌న్.. ఇద్ద‌రూ వైసీపీ ట్రాప్‌లో ప‌డ్డారు: బీజేపీ నేత స‌త్య‌కుమార్‌

  • గతంలో వైసీపీ ట్రాప్‌లో చంద్ర‌బాబు ప‌డ్డారన్న స‌త్య‌కుమార్‌
  • ఫ‌లితంగా చంద్ర‌బాబు ఘోర త‌ప్పిదం చేశార‌ని వ్యాఖ్య‌
  • తాజాగా ప‌వ‌న్ కూడా వైసీపీ ట్రాప్‌లో చిక్కుకున్నార‌ని కామెంట్
  • ఫలితంగానే పొత్తుల‌పై మాట్లాడుతున్నార‌ని విశ్లేష‌ణ‌
  • వైసీపీ ట్రాప్ నుంచి ప‌వ‌న్ బ‌య‌ట‌ప‌డాల‌ని సూచన‌
  • రెండేళ్ల త‌ర్వాత జ‌రిగే ఎన్నిక‌ల‌పై ఇప్పుడు చ‌ర్చ ఎందుక‌న్న స‌త్య‌కుమార్‌
bjp leader satya kumar harsh comments on chandrababu and pawan kalyan

ఇటీవ‌లి జ‌న‌సేన విస్తృత స్థాయి స‌మావేశంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ పార్టీ పొత్తుల‌కు సంబంధింది పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇప్పుడు పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై తాజాగా సోమ‌వారం బీజేపీ జాతీయ కార్య‌ద‌ర్శి స‌త్య‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ వైసీపీ ట్రాప్‌లో ప‌డిపోయార‌ని, ఈ కార‌ణంగా ఎప్పుడో రెండేళ్ల త‌ర్వాత జ‌రిగే ఎన్నిక‌ల‌కు సంబంధించిన పొత్తులు, సీఎం అభ్య‌ర్థిపై ప‌వ‌న్ మాట్లాడుతున్నార‌ని స‌త్య‌కుమార్ వ్యాఖ్యానించారు. ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్లు ఉండ‌గా... ఇప్పుడే పొత్తుల‌పై మాట్లాడాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని కూడా స‌త్య‌కుమార్ ప్ర‌శ్నించారు. 

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా ఏపీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా విజ‌య‌వాడ‌లో స‌త్య‌కుమార్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలోని స‌మ‌స్య‌ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించేందుకే వైసీపీ పొత్తుల‌పై చ‌ర్చ పెడుతోందని ఆయ‌న ఆరోపించారు. వైసీపీ ఆడుతున్న ఈ మైండ్ గేమ్‌లో ప‌డొద్ద‌ని ప‌వ‌న్‌కు సూచిస్తున్నాన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ప‌వ‌న్ మాదిరే 2019 ఎన్నిక‌ల్లోనూ వైసీపీ ర‌చించిన ట్రాప్‌లో చిక్కుకుని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఘోర త‌ప్పిదం చేశార‌ని కూడా ఆయ‌న అన్నారు. చంద్ర‌బాబు చేసిన త‌ప్పును ప‌వ‌న్ చేయ‌రాదని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. 

ఇక బీజేపీ పొత్తుల‌కు సంబంధించి ఎన్నిక‌ల స‌మ‌యంలోనే త‌మ పార్టీ మాట్లాడుతుంద‌ని చెప్పిన స‌త్య‌కుమార్... త‌మ పార్టీ త‌ర‌ఫున సీఎం అభ్య‌ర్థి ఎవ‌ర‌న్న దానిపైనా అప్పుడే ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని చెప్పారు. జ‌న‌సేన‌తో పొత్తు ఉన్న నేపథ్యంలో సీఎం అభ్య‌ర్థి ఎవ‌ర‌న్న విషయంపై ప‌వ‌న్ బీజేపీ అధిష్ఠానంతో చ‌ర్చించుకోవాల‌ని సూచించారు. ఇప్ప‌టికే వైసీపీ ర‌చించిన ట్రాప్‌లో ప‌డిపోయిన జ‌న‌సేన అధినేత‌, ఆ పార్టీ శ్రేణులు, బీజేపీ శ్రేణులు కూడా బ‌య‌ట‌కు రావాల‌ని స‌త్య‌కుమార్ పిలుపునిచ్చారు.

More Telugu News