Nigeria: నైజీరియాలో ఉగ్రవాదుల మారణహోమం: కాల్పులు, బాంబుదాడులతో హోరెత్తిన చర్చి.. 50 మందికి పైగా మృత్యువాత

Over 50 dead as gunmen open fire and detonate explosives at Nigerian church
  • ఆదివారం కావడంతో భక్తులతో కిటకిటలాడిన చర్చి
  • మృతుల్లో ఎక్కువమంది చిన్నారులే
  • పాస్టర్‌ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన ఉగ్రవాదులు
  • ఆ పిశాచాలే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడతాయన్న అధ్యక్షుడు బుహారీ
  • చివరికి గెలిచేది నైజీరియానేనని స్పష్టీకరణ
నైజీరియాలో ఉగ్రవాదులు మరోమారు తెగబడ్డారు. ఓ చర్చిపై కాల్పులు, బాంబు దాడులతో మారణహోమం సృష్టించారు. ఈ ఘటనలో 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా మరింత మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓండో రాష్ట్రంలోని సెయింట్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చిలో ఈ ఘటన జరిగింది. 

ఆదివారం కావడంతో ప్రార్థనల కోసం ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువమంది చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఘటన తర్వాత చర్చి ప్రధాన పాస్టర్‌ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. 

మృతదేహాలు, చెల్లాచెదురుగా పడిన అవయవాలతో చర్చి భీతావహంగా ఉంది. ఈ దాడిలో ఎంతమంది మరణించారన్న విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించనప్పటికీ 50 మందికిపైనే ప్రాణాలు కోల్పోయినట్టు నైజీరియా లోయర్ లెజిస్లేటివ్ చాంబర్ సభ్యుడు అడెలెగ్బె టిమిలెయిన్ తెలిపారు. 

ఈ ఘటనపై నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్ బుహారీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నెదర్ ప్రాంతానికి చెందిన పిశాచాలు మాత్రమే గర్భం దాల్చి ఇటువంటి మారణహోమాన్ని సృష్టించగలవని మండిపడ్డారు. ఏది ఏమైనా, ఈ దేశం ఎప్పటికీ దుష్టులకు లొంగదని తేల్చి చెప్పారు. చీకటి ఎప్పటికీ కాంతిని పారదోలలేదన్నారు. చివరికి నైజీరియానే గెలుస్తుందని బుహారీ పేర్కొన్నారు. 

కాగా, చర్చిపై దాడికి ఇప్పటి వరకు ఏ సంస్థా బాధ్యత ప్రకటించలేదు. నైజీరియాలో అత్యంత శాంతియుత రాష్ట్రాలలో ఒకటిగా ఖ్యాతికెక్కిన ఓండోలో జరిగిన ఈ ఘటన ఆందోళన కలిగిస్తోంది.
Nigeria
Church
Blast
Gunmen
Terrorists
Muhammadu Buhari
Ondo

More Telugu News