TRS: బాధితురాలి వీడియో, ఫొటోలను బయటపెట్టడం పట్ల బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కాంగ్రెస్, టీఆర్ఎస్ మండిపాటు

TRS Congress Slam Raghunandan Rao For revealing victim identity
  • సుప్రీంకోర్టు ఆదేశాలను తుంగలోకి తొక్కారన్న మాణిక్కం ఠాగూర్
  • రఘునందన్ పై కేసు పెట్టాలని డిమాండ్
  • బాలికను రాజకీయాల్లోకి లాగడమేంటని టీఆర్ఎస్ ప్రశ్న
బాలిక గ్యాంగ్ రేప్ ఘటనకు సంబంధించి ఫొటోలు, వీడియోను విడుదల చేయడం పట్ల బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై టీఆర్ఎస్, కాంగ్రెస్ విరుచుకుపడ్డాయి. జూబ్లీ హిల్స్ అత్యాచార ఘటనకు సంబంధించి రఘునందన్ రావు.. ఫొటోలు, వీడియోను మీడియాకు చూపిస్తూ ఆధారాలున్నా ఎందుకు దాస్తున్నారంటూ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. 

దానిపై కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జి, ఎంపీ మాణిక్కం ఠాగూర్ ఫైర్ అయ్యారు. నిన్న రాత్రి పొద్దుపోయాక ఆయన దానిపై ట్వీట్ చేశారు. రేప్ బాధితురాలి వివరాలను గోప్యంగా ఉంచాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రఘునందన్ రావు తుంగలోకి తొక్కారని, లాయర్ అయి ఉండి కూడా ఓ అత్యాచార బాధితురాలి వీడియోను రఘునందన్ బయటకు విడుదల చేశారని మండిపడ్డారు. రాజకీయాల కోసమా? లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసమా? అని నిలదీశారు. రఘునందన్ రావు.. అసదుద్దీన్ వ్యక్తిగత లాయర్ అని కూడా ఆరోపించారు. 

వీడియోను బయటపెట్టడం ద్వారా బాధితురాలు, ఆమె కుటుంబానికి చేటు తలపెట్టేలా ప్రయత్నించారన్నారు. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మధ్య ఉన్న అపవిత్ర పొత్తు వల్లే ఆ వీడియోను బయటపెట్టారా? అని ప్రశ్నించారు. అసలు బీజేపీ ఎమ్మెల్యేకి ఆ వీడియో ఎలా చేతికి వచ్చిందని మాణిక్కం ఠాగూర్ ప్రశ్నించారు. పోలీసులైనా ఇచ్చి ఉండాలని లేదంటే నిందితులైనా ఇచ్చి ఉంటారా? అని ప్రశ్నించారు. గోప్యంగా ఉంచాల్సిన బాధితురాలి వివరాలను బయట పెట్టినందుకు రఘునందన్ రావుపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

అయితే, మాణిక్కం వ్యాఖ్యలకు రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ తోబుట్టువులైన ఎంఐఎం, టీఆర్ఎస్ కష్టాల్లో ఉన్నప్పుడల్లా కాంగ్రెస్ ఎందుకు భయపడుతోందోనని రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. పోలీసుల అబద్ధాలను బట్టబయలు చేయడానికే ‘ఆధారం’ బయటపెట్టానని అన్నారు. గ్యాంగ్ రేప్ కేసులో ఎమ్మెల్యే కొడుకున్నాడని నిరూపించేందుకే అలా చేయాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్, మాణిక్కం ఠాగూర్ కు నిజాలు బయటకు రావడం ఇష్టం లేదేమోనని ట్వీట్ చేశారు. 

దానికి బదులిచ్చిన మాణిక్కం.. తమకు చీప్ టీఆర్పీలు అవసరం లేదని అన్నారు. తమకు బాధితురాలు, ఆమె కుటుంబ జాగ్రత్తే ముఖ్యమన్నారు. సుప్రీంకోర్టును తాము గౌరవిస్తామని, తమకు తల్లులు, చెల్లెళ్ల ఆత్మగౌరవమే ప్రధానమని అన్నారు. బీజేపీ వాళ్లకు ‘భారత్ మాతాకీ జై’ అంటే ఒక నినాదం మాత్రమేనని, కానీ, తమకు ప్రతి తల్లి, చెల్లి ఒక భరతమాతేనని అన్నారు. నిజం కోసమే తమ పోరాటమని పేర్కొన్నారు. తెలుగు బిడ్డ ఆత్మాభిమానాన్ని అవమానించేలా బాధితురాలి వివరాలను బయటపెట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. సంఘీలు, టీఆర్ఎస్, మజ్లిస్ ల చేతిలో తెలంగాణ బిడ్డలకు అవమానం జరగనివ్వబోమని, సంఘీ, మజ్లిస్ మ్యాచ్ ఫిక్సింగ్ ను అనుమతించబోమని తేల్చి చెప్పారు. 

మరోవైపు టీఎస్ఎండీసీ చైర్మన్, టీఆర్ ఎస్ నేత కృషాంక్ కూడా స్పందించారు. అబ్బాయితో ఉన్న బాధితురాలి ఫొటోను రఘునందన్ రావు విడుదల చేశాక ఏమైందంటూ ప్రశ్నించారు. సోషల్ మీడియాలో అమ్మాయి, ఆమె కుటుంబాన్ని నిందితులుగా చూస్తున్నారని ఫైర్ అయ్యారు. రాజకీయాల్లోకి బాధితురాలిని లాగడం ఎందుకని ప్రశ్నించారు.
TRS
BJP
Congress
Raghunandan Rao
Manickam Tagore

More Telugu News