Andhra Pradesh: మాకు చెప్పకుండా పోస్ట్ మార్టం చేస్తారా?.. మార్చురీ ముందు బైఠాయించి, జల్లయ్య కుటుంబ సభ్యుల ఆందోళన

Police Squash Jallaiah Family Members At Narasaraopet Area Hospital
  • పోలీసులు, జల్లయ్య కుటుంబ సభ్యుల మధ్య తోపులాట
  • బాధితులను పక్కకు తొలగించిన పోలీసులు
  • బలవంతంగా జల్లయ్య మృతదేహం తరలింపు
టీడీపీ కార్యకర్త జల్లయ్య హత్య నేపథ్యంలో ఏపీలోని నరసరావుపేట ఏరియా ఆసుపత్రి వద్ద తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. జల్లయ్య మృతదేహానికి పోస్ట్ మార్టం చేయడంపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమకు చెప్పకుండా.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పోస్ట్ మార్టం చేశారని మండిపడ్డారు. 

టీడీపీ నేతలు వచ్చేదాకా పోస్ట్ మార్టం చేయొద్దని, అప్పటిదాకా ఆగాలని చెప్పినా వినిపించుకోలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వారంతా మార్చురీ వద్ద బైఠాయించారు. దీంతో పోలీసులు, జల్లయ్య కుటుంబ సభ్యుల మధ్య తోపులాట జరిగింది. పోస్ట్ మార్టం అనంతరం జల్లయ్య మృతదేహాన్ని పోలీసులు తరలించేందుకు ప్రయత్నించగా కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. 

దీంతో వారిని పక్కకు తొలగించి మరీ పోలీసులు జల్లయ్య మృతదేహాన్ని బొల్లాపల్లి మండలం రావులపురం తరలించారు. కాగా, పల్నాడు జిల్లా దుర్గి మండలం జంగమహేశ్వరపాడులో జల్లయ్యను నిన్న ప్రత్యర్థులు హత్య చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. 

ఆసుపత్రికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. కొల్లు రవీంద్ర, జీవీ ఆంజనేయులు తదితరులను అడ్డుకున్నారు.
Andhra Pradesh
Jallaiah
Murder
Crime News
Police
AP Police

More Telugu News