Corona: కరోనా కేసులు పెరుగుతున్నాయి జాగ్రత్త!... తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

Center alerts five states including Telangana to asses corona spreading
  • దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా వ్యాప్తి
  • ప్రధానంగా ఐదు రాష్ట్రాలపై దృష్టి సారించిన కేంద్రం
  • కేరళలో అత్యధిక సంఖ్యలో కేసులు
  • చర్యలు తీసుకోవాలన్న కేంద్రం
దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై కేంద్రం కూడా దృష్టి సారించింది. ప్రధానంగా ఐదు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదల చోటుచేసుకున్నట్టు కేంద్రం గుర్తించింది. ఈ మేరకు ఆ ఐదు రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ లేఖ రాసింది. తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో స్థానికంగా కరోనా వ్యాప్తి అధికమైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ భావిస్తోంది. 

కరోనా మహమ్మారిపై తీవ్ర పోరాటం సాగించి సాధించిన ఫలితాలను వృథా చేయరాదని, ఆ ఆధిక్యతను నిలుపుకునే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వ్యాప్తి మరింత ఉద్ధృతం కాకుండా కట్టుదిట్టమైన కార్యాచరణ రూపొందించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తమ లేఖలో పేర్కొన్నారు. ఇది సమష్టి యజ్ఞం అని, ఇందులో ఏదైనా సహాయం కావాల్సి వస్తే చేసేందుకు కేంద్ర ఆరోగ్య, శిశు సంక్షేమ శాఖ సిద్ధంగా ఉందని తెలిపారు. 

కాగా, దేశంలో వెల్లడైన కొత్త కేసుల్లో కేరళలోనే అత్యధికంగా నమోదయ్యాయి. దేశం మొత్తమ్మీద కేరళలో 31.14 శాతం కొత్త కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో, దేశంలో నమోదైన కొత్త కేసుల్లో 1.78 శాతం  తెలంగాణలో వెలుగుచూశాయి.
Corona
New Cases
States
Telangana
Center

More Telugu News