Target Killings: జమ్మూకశ్మీర్ లో లక్షిత హత్యలకు పాకిస్థానే కారణం: కేంద్రం

  • కశ్మీర్ లో పండిట్లను చంపుతున్న దుండగులు
  • ఇటీవల కాలంలో వరుస హత్యలు
  • తీవ్రంగా పరిగణిస్తున్న కేంద్రం
  • అమిత్ షా వరుస సమావేశాలు
Center alleges Pakistan caused to target killings in Jammu and Kashmir

కశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకుని జమ్మూకశ్మీర్ లో కొనసాగుతున్న హత్యాకాండపై కేంద్రం తీవ్రస్థాయిలో దృష్టి సారించింది. ఈ లక్షిత హత్యలకు పాకిస్థానే కారణమని నిందించింది. కేంద్ర నిఘా వర్గాలు కశ్మీర్ హత్యాకాండకు పాకిస్థాన్ నే వేలెత్తి చూపిస్తున్నాయి. 

కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న వరుస సమావేశాలతో కశ్మీర్ లోయలో పరిస్థితిని సమీక్షించారు. ఐబీ డైరెక్టర్ అర్వింద్ కుమార్, రా చీఫ్ సామంత్ గోయల్ లతో భేటీ అయ్యారు. ఈ ఉన్నతస్థాయి సమావేశంలో జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్ బాగ్ సింగ్ కూడా పాల్గొన్నారు. 

ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వంలోని ఓ సీనియర్ అధికారి స్పందిస్తూ, కశ్మీర్ లో హింస మరోస్థాయికి చేరిందని, అయితే దీన్ని జిహాద్ గా భావించలేమని పేర్కొన్నారు. కొన్ని అసంతృప్త శక్తులు ఈ హత్యలకు పాల్పడుతున్నాయని పేర్కొన్నారు. కాగా, కశ్మీర్ లోయలో తాలిబన్లు ప్రవేశించారనడానికి ఆధారాలేవీ లేవని అధికారులు అమిత్ షాకు నివేదించారు. 

కశ్మీరీ పండిట్లకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కేంద్రం భావిస్తోంది. అయితే వారిని కశ్మీర్ వెలుపలకు మాత్రం తరలించబోవడంలేదని స్పష్టం చేసింది.

More Telugu News