Dimple Kapadia: జైపూర్ ప్యాలెస్ లో దెయ్యం... తన తల్లి దాంతో మాట్లాడిందంటున్న బాలీవుడ్ నటి

Twinkle Khanna says her mother Dimple Kapadia talked to a ghost in Jaipur Palace
  • 1990లో 'లేకిన్' చిత్రంలో నటించిన డింపుల్ కపాడియా
  • జైపూర్ ప్యాలెస్ లో షూటింగ్
  • రాజమాతను ఇంటర్వ్యూ చేసిన డింపుల్ కుమార్తె ట్వింకిల్
  • తన తల్లి అనుభవాన్ని రాజమాతతో పంచుకున్న వైనం
బాలీవుడ్ నటి, సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ అర్ధాంగి ట్వింకిల్ ఖన్నా ఆసక్తికర అంశం వెల్లడించారు. ఇటీవల ఆమె తన యూట్యూబ్ చానల్ కోసం జైపూర్ రాజవంశీకురాలు రాజమాత పద్మినీ దేవితో ముచ్చటించారు. ఈ సందర్భంగా ట్వింకిల్ తన తల్లి డింపుల్ కపాడియాకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించారు. 

గతంలో ఓసారి తన తల్లి జైపూర్ రాయల్ ప్యాలెస్ ను సందర్శించిందని, అప్పుడు ఆమెకు ఆ రాజ భవనంలో దెయ్యం కనిపించిందని తెలిపారు. అంతేకాదు, తన తల్లి ఆ దెయ్యంతో మాట్లాడిందని కూడా వెల్లడించారు. 

1990లో 'లేకిన్' అనే హిందీ చిత్రం షూటింగ్ కోసం డింపుల్ కపాడియా అక్కడికి వెళ్లిందని, ఓ రాత్రంతా జైపూర్ ప్యాలెస్ లోనే గడిపిందని ట్వింకిల్ వివరించారు. తన తల్లి పడుకుని ఉండగా, ఆమె పడక పక్కనే ఓ మహిళ నిల్చుని కనిపించిందని, అది దెయ్యం అని తన తల్లి గుర్తించినట్టు తెలిపారు. దాంతో చాలాసేపు మాట్లాడినట్టు కూడా పేర్కొన్నారు.

అయితే, రాజమాత పద్మినీ దేవి దీనిపై స్పందిస్తూ... ఆ సమయంలో డింపుల్ నటిస్తోంది ఓ దెయ్యం సినిమాలో అని, ఆ ప్రభావం ఆమెపై పడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. మానసిక భ్రాంతుల కారణంగానే డింపుల్ దెయ్యంతో మాట్లాడిన అనుభూతికి లోనై ఉంటుందని వివరించారు. అప్పట్లో ఇదే విషయాన్ని తాను డింపుల్ తోనూ చెప్పానని, జైపూర్ ప్యాలెస్ లో దెయ్యాలేవీ లేవన్న విషయాన్ని ఆమెకు స్పష్టం చేశానని తెలిపారు. 

రోజంతా దెయ్యంలా నటించి, దెయ్యం ఆలోచనలతోనే పడుకున్నావు కాబట్టి, నీకు దెయ్యం కనిపించినట్టు భ్రమపడుతున్నావని డింపుల్ కు వివరించినట్టు రాజమాత పద్మినీ దేవి వెల్లడించారు. 

'లేకిన్' చిత్రంలో డింపుల్ 'రేవా' అనే దెయ్యం పాత్ర పోషించారు. గుల్జార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో వినోద్ ఖన్నా, అంజాద్ ఖాన్, అలోక్ నాథ్ తదితరులు నటించారు. ఈ సినిమాలో అత్యుత్తమ నటనకు గాను డింపుల్ కపాడియాకు ఫిలింఫేర్ అవార్డు కూడా లభించింది.
Dimple Kapadia
Ghost
Jaipur Palace
Twinkle Khanna
Rajamatha Padmini Devi

More Telugu News