Alina Kabaeva: పుతిన్ ప్రేయసి గౌరవార్థం ఏకంగా క్రీడోత్సవం నిర్వహించిన రష్యా ప్రభుత్వం

Russia reportedly organized a festival in the name of Alina

  • జిమ్నాస్ట్ అలినా కబయేవాతో పుతిన్ ప్రేమాయణం
  • ముగ్గురు పిల్లలు కూడా కలిగినట్టు మీడియా కథనాలు
  • గత నెలలో మాస్కోలో జిమ్నాస్టిక్ ఈవెంట్
  • అలినా ఫెస్టివల్ పేరిట క్రీడా పోటీలు

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రేయసిగా గుర్తింపు పొందిన ప్రముఖ జిమ్నాస్ట్ అలినా కబయేవా గౌరవార్థం అక్కడి ప్రభుత్వం ఓ క్రీడోత్సవం నిర్వహించిన విషయం తాజాగా వెల్లడైంది. అలినా కబయేవా గతంలో రష్యా తరఫున అనేక అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని విజయాలు సాధించారు. ఆమె ఒలింపిక్స్ లోనూ రష్యాకు స్వర్ణం అందించారు. అయితే పుతిన్ తో పరిచయం అయ్యాక కబయేవా రాజకీయాల్లో అడుగుపెట్టి ఆరేళ్ల పాటు ఎంపీగా సేవలు అందించారు. అలినా కబయేవా వయసు 38 కాగా, పుతిన్ వయసు 69 సంవత్సరాలు. 

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర నేపథ్యంలో, ఆమెను పుతిన్ సురక్షితంగా దేశం దాటించాడని పాశ్చాత్య మీడియాలో కథనాలు వచ్చాయి. కాగా, గత నెలలో రష్యాలో అలినా ఫెస్టివల్ పేరిట ఓ జిమ్నాస్టిక్ క్రీడోత్సవం నిర్వహించినట్టు న్యూయార్క్ పోస్ట్ మీడియా సంస్థ వెల్లడించింది. అయితే ఈ క్రీడా పోటీలు రష్యా ప్రభుత్వ టీవీ చానల్ రష్యా-1లో బుధవారం ప్రసారమయ్యాయని తెలిపింది. బాలల సంరక్షణ దినం సందర్భంగా ఈ కార్యక్రమం ప్రసారం చేసినట్టు పేర్కొంది. 

దీనికి సంబంధించిన వీడియోలో సోవియట్ యూనియన్ దేశభక్తి గీతాలు నేపథ్యంలో వినిపిస్తుండగా, వందలాది చిన్నారులు, జిమ్నాస్ట్ లు వేదికపై ప్రదర్శన ఇస్తున్న దృశ్యాలు ఉన్నాయి. కాగా, ఈ వీడియోలో అలినా కబయేవా కూడా కనిపించినట్టు న్యూస్ వీక్ అనే మరో మీడియా సంస్థ పేర్కొంది. 

కబయేవాతో తన సంబంధం గురించి పుతిన్ ఇప్పటివరకు ఎక్కడా పెదవి విప్పలేదు. అయితే, అమెరికా నిఘా వర్గాలు మాత్రం అలినా, పుతిన్ లకు కనీసం ముగ్గురు పిల్లలు ఉన్నారని భావిస్తున్నాయి. పుతిన్ తో అత్యంత సాన్నిహిత్యం వల్లే ఆమెకు రష్యా ప్రభుత్వంలో ఎంతో గుర్తింపు లభించిందని మీడియా సంస్థలు చెబుతుంటాయి. ప్రభుత్వ జాతీయ మీడియా గ్రూప్ డైరెక్టర్ల బోర్డుకు కబయేవా ఏడేళ్ల పాటు చైర్ పర్సన్ గా పనిచేశారు. ఈ హోదాలో ఆమె ఏడాదికి రూ.78 కోట్ల వేతనం అందుకునేవారని డైలీమెయిల్ మీడియా సంస్థ పేర్కొంది.

Alina Kabaeva
Festival
Vladimir Putin
Gymnastics
Moscow
Russia
  • Loading...

More Telugu News