CRDA: ప్లాట్లు రిజిస్టర్ చేసుకోవాలంటూ అమరావతి రైతులకు ఆహ్వానం పలికిన సీఆర్డీఏ

  • రాజధాని కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతులు
  • గత ప్రభుత్వ హయాంలో ఆయా భూముల రిజిస్ట్రేషన్లు
  • వైసీపీ సర్కారు వచ్చాక నిలిచిన ప్రక్రియ
  • హైకోర్టు ఆదేశాలతో ముందుకు కదిలిన రాష్ట్ర ప్రభుత్వం
CRDA invites farmers to register their plots

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం నేపథ్యంలో గత ప్రభుత్వం రైతుల నుంచి 34,385 ఎకరాలు సేకరించింది. ఒప్పందం ప్రకారం నివాస, వాణిజ్య తరహాలో ఆ ప్లాట్లను అభివృద్ధి చేసి తిరిగివ్వాల్సి ఉంది. దాని ప్రకారం గత ప్రభుత్వం ఉన్నప్పుడే 40,378 ప్లాట్లను రిజిస్టర్ చేశారు. అనంతరం వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ ప్రక్రియ నిలిచిపోయింది. 

దీనిపై హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో వైసీపీ ప్రభుత్వం ముందుకు కదిలింది. మిగిలిన ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రకియకు మార్చి నెలాఖరు వరకు గడువు విధించారు. అప్పటికీ రిజిస్ట్రేషన్ చేయించుకోని వారి కోసం మరోసారి గడువును పొడిగించారు. 

ఈ నేపథ్యంలో, తమ ప్లాట్లను రిజిస్టర్ చేసుకునేందుకు రావాలంటూ అమరావతి రైతులకు సీఆర్డీఏ ఆహ్వానం పలికింది. ఈ నెలాఖరు వరకు గడువు ఉందని, రైతులు వెంటనే స్పందించి తమ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ ఉత్తర్వులు ఇచ్చారు. ఇంకా రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఉన్న రైతులకు నోటీసులు పంపుతున్నారు. 

కాగా, ఏపీ సర్కారు మూడు రాజధానులకు మొగ్గుచూపుతుండడంతో అమరావతి రైతులు ఈ రిజిస్ట్రేషన్లపై ఏమంత ఆసక్తి చూపడంలేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అమరావతిలో ప్రస్తుతం భూముల పరిస్థితిపై తాము లేవనెత్తిన అభ్యంతరాలను సీఆర్డీఏ పట్టించుకోవడంలేదన్న అసంతృప్తి కూడా రైతుల్లో ఉందని ప్రచారం జరుగుతోంది.

More Telugu News