MS Dhoni: క్రికెటర్లు తమ జిల్లాకు ప్రాతినిధ్యం వహించడాన్ని గర్వకారణంగా భావించాలి: ధోనీ

Dhoni says cricketers should be proud of district cricket
  • తిరువళ్లూరు క్రికెట్ సంఘం సిల్వర్ జూబ్లీ వేడుకలు
  • ముఖ్య అతిథిగా హాజరైన ధోనీ
  • జిల్లా స్థాయి క్రికెట్టే ఎదుగుదలకు తొలి మెట్టు అని వెల్లడి
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెటర్లు తమ జిల్లాలకు ప్రాతినిధ్యం వహించడాన్ని కూడా గర్వకారణంగానే భావించాలని పేర్కొన్నాడు. ఎందుకంటే, క్రికెటర్లు ఉన్నతస్థాయికి ఎదగడానికి జిల్లా స్థాయి క్రికెట్టే సోపానం అని తెలిపాడు. తమిళనాడులోని తిరువళ్లూరు క్రికెట్ సంఘం సిల్వర్ జూబ్లీ వేడుకలకు ధోనీ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. 

ఈ సందర్భంగా ధోనీ మాట్లాడుతూ, "ఓ జిల్లా క్రికెట్ సంఘం వేడుకలకు హాజరుకావడం నాకు ఇదే ప్రథమం. ఈ సందర్భంగా నా సొంత జిల్లా (రాంచీ) క్రికెట్ సంఘానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా జిల్లాకు ఆడడాన్ని నేను గర్వంగా భావిస్తాను. ఎందుకంటే దేశానికి ఆడే క్రమంలో నా ఎదుగుదల జిల్లా స్థాయి నుంచే ప్రారంభమైంది. ఈ వాస్తవాన్ని నేనెప్పుడూ గౌరవిస్తాను. ఒకవేళ నేను నా స్కూల్ కు, జిల్లాకు ఆడకపోయుంటే ఇదంతా సాధ్యమయ్యేది కాదు" అని వివరించాడు. కాగా, ఈ కార్యక్రమానికి చెన్నై సూపర్ కింగ్స్ యజమాని ఎన్.శ్రీనివాసన్ కూడా హాజరయ్యారు.
MS Dhoni
District Cricket
Thiruvallur District Cricket Association
Tamilnadu

More Telugu News