South Africa: టీమిండియాతో టీ20 సిరీస్ కోసం భారత్ చేరుకున్న దక్షిణాఫ్రికా జట్టు

South Africa team arrives Delhi for T20 Series with Team India
  • ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్ లు
  • జూన్ 9న ఢిల్లీలో తొలి మ్యాచ్
  • టెంబా బవుమా నాయకత్వంలో ఢిల్లీలో అడుగుపెట్టిన సఫారీలు
టీమిండియాతో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా జట్టు ఈ ఉదయం ఢిల్లీ చేరుకుంది. జూన్ 9న ఇరు జట్ల మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ లో రోహిత్ శర్మ గైర్హాజరీ నేపథ్యంలో, కేఎల్ రాహుల్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఈ సిరీస్ లో కోహ్లీ కూడా ఆడడంలేదు. 

అటు, ఐపీఎల్ లో విశేషంగా రాణించిన హార్దిక్ పాండ్యా, కులదీప్ యాదవ్, దినేశ్ కార్తీక్ ఈ సిరీస్ ద్వారా టీమిండియాలోకి పునరాగమనం చేస్తున్నారు. అంతేకాదు, ఐపీఎల్ లో తన వేగంతో అందరినీ అచ్చెరువొందించిన జమ్మూ కశ్మీర్ యువకెరటం ఉమ్రాన్ మాలిక్ ఈ సిరీస్ ద్వారా తొలిసారి టీమిండియాకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఉమ్రాన్ మాలిక్ ఇటీవల ముగిసిన ఐపీఎల్ 15వ సీజన్ లో మొత్తం 13 మ్యాచ్ లు ఆడి 21 వికెట్లు తీశాడు. 

దక్షిణాఫ్రికా జట్టుకు టెంబా బవుమా నాయకత్వం వహించనున్నాడు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో, భారత్ వచ్చిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు ప్రతిరోజూ ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించనున్నారు.

దక్షిణాఫ్రికా జట్టు ఇదే...
టెంబా బవుమా (కెప్టెన్), క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, ఐడెన్ మార్ క్రమ్, వాన్ డర్ డుస్సెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టాన్ స్టబ్స్, డ్వేన్ ప్రిటోరియస్, ఆన్రిచ్ నోర్జే, కేశవ్ మహరాజ్, కగిసో రబాడా, మార్కో జాన్సెన్, లుంగీ ఎంగిడి, వేన్ పార్నెల్, తబ్రైజ్ షంసీ.
South Africa
Delhi
T20 Series
Team India

More Telugu News