Virender Sehwag: ధోనీ నన్ను జట్టులోంచి తీసేశాడు... కానీ సచిన్ మాటలతో మనసు మార్చుకున్నా: సెహ్వాగ్

  • 2008 నాటి సంఘటనలను వివరించిన సెహ్వాగ్
  • ఆసీస్ టూర్ లో వన్డేల్లో వైఫల్యం
  • తుది జట్టుకు పరిగణనలోకి తీసుకోని ధోనీ
  • రిటైర్ అవ్వాలనుకున్నట్టు సెహ్వాగ్ వెల్లడి
Sehwag reveals when he thought about ODI retirement

భారత క్రికెట్ లో విధ్వంసక బ్యాటింగ్ ను పరిచయం చేసిన ఆటగాడు ఎవరంటే నిస్సందేహంగా వీరేంద్ర సెహ్వాగ్ పేరే చెబుతారు. టెస్టు క్రికెట్ లో వన్డే తరహా బ్యాటింగ్ తో సెహ్వాగ్ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. బౌలర్ ఎవరన్నది లెక్కచేయని సెహ్వాగ్.. కొన్నిసార్లు పుట్ వర్క్ లేకుండానే బంతిని బౌండరీ దాటించేవాడంటే అతడి భుజబలం ఎలాంటిదో అర్థమవుతుంది. కాగా, ఓ కార్యక్రమంలో డాషింగ్ ఆటగాడు ఆసక్తికర అంశాలను వెల్లడించాడు.

"క్రికెట్ లో రెండు రకాల వ్యక్తులు ఉంటారు. ఒకరు సవాళ్లను స్వీకరిస్తూ ఆటను ఆస్వాదిస్తుంటారు. విరాట్ కోహ్లీ ఆ కోవలోకే వస్తాడు. అతడు విమర్శలను గమనిస్తూ తనను తాన మెరుగుపర్చుకుంటాడు. కానీ రెండో రకం ఆటగాళ్లు విమర్శలను ఏమాత్రం పట్టించుకోరు. ఎందుకంటే, తాము ఏంచేయగలమన్న దానిపై వారికి స్పష్టత ఉంటుంది. నేను ఈ రెండో రకానికి చెందినవాడ్ని. నన్ను విమర్శించే వారి గురించి, విమర్శించని వారి గురించి పట్టించుకునేవాడ్ని కాదు. 

కానీ 2008లో నా మదిలోకి రిటైర్మెంట్ ఆలోచన వచ్చింది. అప్పుడు మేం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నాం. ఆ సమయంలోనే నేను టెస్టులోకి పునరాగమనం చేసి ఓ మ్యాచ్ లో 150 పరుగులు చేశాను. కానీ వన్డేల్లో భారీ స్కోర్లు సాధించలేకపోయాను. మూడ్నాలుగు మ్యాచ్ ల్లో ఇలాగే ఆడడంతో అప్పటి కెప్టెన్ ధోనీ నన్ను తుది జట్టు నుంచి తప్పించాడు. దాంతో వన్డే క్రికెట్ కు గుడ్ బై చెబుదామా అన్న ఆలోచన వచ్చింది. కానీ సచిన్ టెండూల్కర్ ఆ సమయంలో నన్ను నిలువరించాడు. 

ఇది నీ కెరీర్ లో ఓ దుర్దశ అనుకో అని చెప్పాడు. సిరీస్ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లి ఆత్మపరిశీలన చేసుకో. గట్టిగా ఆలోచించి ఏం చేయాలో అప్పుడు నిర్ణయించుకో... అని సచిన్ సలహా ఇచ్చాడు. అదృష్టవశాత్తు నేను నా రిటైర్మెంట్ ప్రకటించలేదు. ఒకవేళ అప్పుడు రిటైర్మెంట్ ప్రకటించి ఉంటే కేవలం టెస్టు మ్యాచ్ లకే పరిమితమయ్యేవాడ్ని. 

ఇక ఆసీస్ పర్యటన ముగిసిన తర్వాత భారత్ తిరిగొచ్చాం. అప్పటి సెలెక్షన్ కమిటీ చైర్మన్ కృష్ణమాచారి శ్రీకాంత్ నాతో మాట్లాడాడు. ఏం చేద్దాం అని నన్నడిగాడు. నేను మంచి ఫామ్ లో ఉన్నా గానీ పక్కనబెట్టారు... అందుకు నేనేం చేయగలను? అని బదులిచ్చాను. అన్ని మ్యాచ్ ల్లో జట్టులో స్థానం ఉంటుందన్న భరోసా ఇచ్చినప్పుడే నన్ను వన్డేలకు ఎంపిక చేయండి... మరోవిధంగా అయితే నన్ను ఎంపిక చేయవద్దు అని కరాఖండీగా చెప్పేశాను. 

దాంతో శ్రీకాంత్ 2008 ఆసియా కప్ సందర్భంగా ధోనీతో చర్చించాడు. అనంతరం, ధోనీ నాతో మాట్లాడాడు. జట్టులో ఏ స్థానంలో బ్యాటింగ్ కు దిగాలనుకుంటున్నావు అని అడిగాడు. బ్యాటింగ్ స్థానం కాదు... నాకు అన్ని మ్యాచ్ ల్లో ఆడే అవకాశం ఇస్తే చాలన్నాను. ఆ తర్వాత వన్డేల్లోనూ నేను మరింత మెరుగ్గా రాణించాను" అంటూ సెహ్వాగ్ వివరించాడు.

More Telugu News