K Kavitha: మోదీ అండతో అదానీ దేశ ప్రధాని మాదిరి వ్యవహరిస్తున్నారు: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

Gautam Adani is behaving like Prime Minister says Kalvakuntla Kavitha
  • కార్పొరేట్లకు అనుకూలంగా మోదీ వ్యవహరిస్తున్నారన్న కవిత 
  • అదానీకి ప్రభుత్వ సంస్థలను ధారాదత్తం చేస్తున్నారని విమర్శ 
  • మోదీ ఎప్పుడూ ఎన్నికల మోడ్ లోనో లేదా ఏరో ప్లేన్ మోడ్ లోనో ఉంటారంటూ సెటైర్ 
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కాపాడుకునేందుకు తమ ప్రభుత్వం రూ. 1,000 కోట్లను ఖర్చు చేస్తోందని... కేంద్ర ప్రభుత్వం మాత్రం లాభాల్లో ఉన్న సంస్థలను కూడా అమ్ముకుంటోందని ఆమె విమర్శించారు.

కార్పొరేట్లకు అనుకూలంగా మోదీ ప్రభుత్వం పని చేస్తోందని ఆరోపించారు. లక్షల కోట్ల విలువైన ఎయిరిండియా సంస్థను కేవలం కొన్ని వేల కోట్లకే అమ్మేశారని దుయ్యబట్టారు. వ్యాపారవేత్త అదానీకి ప్రభుత్వ సంస్థలన్నింటినీ ధారాదత్తం చేస్తున్నారని కవిత విమర్శించారు. మోదీ అండతో అదానీ భారత ప్రధాని మాదిరి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 

కార్మికులకు లబ్ధిని చేకూర్చే 40 చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసేసిందని.. కార్మికులకు అన్యాయం చేసే నాలుగు చట్టాలను తీసుకొచ్చిందని కవిత విమర్శించారు. కార్మికుల హక్కుల కోసం టీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుందని చెప్పారు. ఢిల్లీలో రైతులు చేసిన పోరాటాలను కార్మికులు స్ఫూర్తిగా తీసుకుని పోరాడాలని.. అప్పుడే మోదీ ప్రభుత్వం నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటుందని అన్నారు. 

ప్రజలను మోదీ ప్రభుత్వం మోసం చేస్తోందని... ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట చెపుతుందని కవిత విమర్శించారు. ఎన్నికల ముందు వరకు ఇచ్చిన రేషన్ ను... ఎన్నికల తర్వాత కట్ చేశారని అన్నారు. మోదీ ఎప్పుడూ ఎన్నికల మోడ్ లోనో లేదా ఏరో ప్లేన్ మోడ్ లోనే ఉంటారని చెప్పారు. ఎన్నికల ప్రచారం లేకపోతే... ఆయన విదేశీ పర్యటనల్లో ఉంటారని ఎద్దేవా చేశారు. మోదీ పాలనలో పేదలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు.
K Kavitha
TRS
Narendra Modi
BJP
Gautam Adani

More Telugu News