Vijayasanthi: తెలంగాణలో 24 గంటల ఉచిత కరెంటు పేరిట భారీ కుంభకోణం జరుగుతోంది: విజయశాంతి

  • సీఎం కేసీఆర్ పై విజయశాంతి విమర్శనాస్త్రాలు
  • కరెంటు కొనుగోళ్లలో కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపణ
  • భద్రాద్రి పవర్ ప్లాంట్ ఓ పెద్ద స్కాం అని విమర్శలు
Vijayasanthi slams CM KCR and TRS Govt

తెలంగాణలో 24 గంటల ఉచిత కరెంటు పేరిట భారీ కుంభకోణం జరుగుతోందని బీజేపీ మహిళా నేత విజయశాంతి ఆరోపించారు. ప్రైవేటు కంపెనీలతో చేతులు కలిపి మార్కెట్ రేటు కంటే రెట్టింపు ధరకు కరెంటు కొనుగోలు చేస్తూ కమీషన్లు దండుకుంటున్నారని విమర్శించారు.  

ఒకవైపు సిద్ధిపేట, గజ్వేల్, హైదరాబాదు పాతబస్తీ వంటి ప్రాంతాల్లో కరెంటు బిల్లులు వసూలు చేయలేని పరిస్థితి ఉంటే, సీఎం కేసీఆర్ మాత్రం తన ఫాంహౌస్ కు 40 గ్రామాలకు ఉపయోగించేంత కరెంటును వాడుకుంటున్నారని విజయశాంతి మండిపడ్డారు. ఇక భద్రాద్రి పవర్ ప్లాంటు ఓ పెద్ద స్కాంలా మారిందని విమర్శించారు. బినామీ వ్యక్తులకు ఈ పవర్ ప్లాంటును అప్పజెప్పిన కేసీఆర్ పెద్ద మొత్తంలో కమీషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. 

మరోవైపు, సింగరేణి కార్మికుల డిపాజిట్లు డ్రా చేసి జీతాలు చెల్లించే స్థాయికి కేసీఆర్ దిగజారారని పేర్కొన్నారు. రామగుండంలో కేంద్ర ప్రభుత్వం రూ.6 వేల కోట్లకు పైగా నిధులతో ఎరువుల కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మూసివేసేందుకు కుట్ర చేస్తోందని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News