Southwest Monsoon: ఈసారి నైరుతి సీజన్ లో అత్యధిక వర్షపాతం... మునుపటి అంచనాలను సవరించిన ఐఎండీ

  • కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు
  • మూడ్రోజుల ముందుగానే వచ్చిన నైరుతి
  • 103 శాతం సగటు వర్షపాతం నమోదవుతుందన్న ఐఎండీ
  • గత ఏప్రిల్ లో ఈ సగటు 99 శాతమని పేర్కొన్న వైనం
IMD updates earlier predictions of monsoon season

కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించడం తెలిసిందే. సాధారణంగా ప్రతి ఏడాది జూన్ 1వ తేదీని నైరుతి రుతుపవనాలు భారత్ లో అడుగుపెట్టే సమయంగా భావిస్తారు. అయితే ఈసారి మూడ్రోజుల ముందుగానే రుతుపవనాలు విచ్చేశాయి. ఈ నేపథ్యంలో, భారత వాతావరణ విభాగం (ఐఎండీ) స్పందించింది. 

మునుపటి అంచనాలను సవరిస్తూ, ఈసారి నైరుతి సీజన్ లో దేశంలో అత్యధిక వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. దీర్ఘకాలిక సగటును అనుసరించి భారత్ లో 103 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. గత ఏప్రిల్ లో వెలువరించిన అంచనాల ప్రకారం.... దేశంలో నైరుతి రుతుపవనాల వల్ల సాధారణ వర్షపాతం (99 శాతం) నమోదవుతుందని ఐఎండీ పేర్కొంది. మారిన వాతావరణ పరిస్థితులు, రుతుపవనాలు ముందే దేశంలో అడుగుపెట్టడం వంటి కారణాలతో కొత్త అంచనాలు రూపొందించింది. 

దీనిపై ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వివరణ ఇచ్చారు. ముందస్తు అంచనాలను అప్ డేట్ చేశామని వెల్లడించారు. నైరుతి సీజన్ లో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో విరివిగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. మధ్య, ఉత్తర భారతదేశంలో సగటున 106 శాతం వర్షాలు కురుస్తాయని, ఈశాన్య రాష్ట్రాల్లో ఆ సగటు సాధారణం కంటే తక్కువగా ఉండొచ్చని వివరించారు. ఓవరాల్ గా చూస్తే దేశవ్యాప్తంగా వర్షపాతం సగటు 100 శాతానికి పైబడి ఉంటుందని తెలిపారు.

More Telugu News